లోన్ యాప్, కాల్ మనీ… పేరు ఏదైనా వాటి ద్వారా అప్పులు తీసుకొన్నవారి పరిస్థితి చివరికి విషాదంగానో భయానకంగానో ముగుస్తుంటుంది. రెండు రోజుల క్రితమే ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామకు చెందిన జాస్తి హరిత వర్షిణి అనే 17 ఏళ్ళ విద్యార్ధిని రికవరీ ఏజంట్ల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకొంది.
రెండు తెలుగు రాష్ట్రాలలో ఇటువంటి ఘటనలు నిత్యం జరుగుతున్నప్పటికీ ప్రభుత్వాలు, పోలీస్ యంత్రాంగం వాటిని పట్టించుకోవడం లేదు. ఎవరైనా వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకొంటేనో లేదా పోలీసులను ఆశ్రయిస్తేనో కేసులు నమోదు చేసి వాటి నిర్వాహకులపై చర్యలు తీసుకొంటున్నారు. కనుక లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు నానాటికీ పెరిగిపోతూనే ఉన్నాయి.
అవి ఏ స్థాయికి పెరిగిపోయాయంటే, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి శంకర్ కూడా వారి వేధింపులకు గురయ్యారు. తక్షణం డబ్బు కట్టాలని, లేకుంటే పిల్లలని చంపేస్తామని గత కొన్నిరోజులుగా వారు బెదిరిస్తున్నారని శంకరయ్య నెల్లూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశం మేరకు పుత్తూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని శంకరయ్యను బెదిరిస్తున్నవారిని అరెస్ట్ చేశారు.
పుత్తూరు సీఐ వేమారెడ్డి ఈ కేసు గురించి మీడియాకు వివరించారు. “నెల్లూరులో ఓ వ్యక్తి చెన్నైలోని కోల్‌మ్యాన్ ఫైనాన్స్ కంపెనీ నుంచి రూ.8.95 లక్షలు లోన్ తీసుకొన్నాడు. కొంత సొమ్ము చెల్లించాక మిగిలింది కట్టలేక చేతులు ఎత్తేశాడు. దానిని రికవరీ చేసుకోవడం కోసం అతని ఫోన్ కాంటాక్ట్స్ లో ఉన్నవారందరికీ ఈ సంస్థ రికవరీ ఏజంట్స్ ఫోన్లు చేసి మిగిలిన డబ్బు వసూలు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
ఆ ప్రయత్నంలోనే మంత్రిగారి పీఏను కూడా బెదిరించడంతో ఆయన తన వలన మంత్రిగారికి చెడ్డపేరు వస్తుందనే భయంతో ఓ 25 వేలు కట్టారు. అప్పటి నుంచి వారి వేధింపులు ఇంకా ఎక్కువైపోయాయి. ఆయన ఫిర్యాదు మేరకు మేము చెన్నైకి వెళ్ళి కోల్‌మ్యాన్ ఫైనాన్స్ కంపెనీకి చెందిన నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశాము, “ అని చెప్పారు.
ఒక రాష్ట్ర మంత్రి పీఏనే లోన్ యాప్ నిర్వాహకులు వేదిస్తూ, ఆయన పిల్లలను చంపేస్తామని బెదిరించారంటే ఇక సామాన్య ప్రజలను ఎంతగా వేదిస్తున్నారో ఊహించవచ్చు. అసలు సమాజంలో ఇంత అరాచకాలు సాగుతున్నాయని తెలిసినా ఎంపీ విజయసాయి రెడ్డి చేత ‘సమర్దుడైన ముఖ్యమంత్రి’ అని సర్టిఫికేట్ పొందిన జగన్మోహన్ రెడ్డి ఇటువంటి నేరాలను ఉక్కుపాదంతో అణచివేసే ప్రయత్నం చేయకపోవడం చాలా బాధాకరమే. సామాన్యుల బాధలు తెలియాలంటే ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యే అందరూ కూడా లోన్లు తీసుకొని చూస్తే అర్దమవుతుందేమో?



