ఈరోజు టిడిపి యువనేత నారా లోకేష్ తాడేపల్లికి వెళుతుండగా దారిలో ఉండవల్లి కరకట్ట వద్ద పోలీసులు ఆయన కాన్వాయ్‌ని ఆపి తనిఖీలు చేశారు. నారా లోకేష్ అందుకు ఏమాత్రం అభ్యంతరం చెప్పకుండా వారికి సహకరించారు. ఆయన వాహనంలో ఏమీ లేకపోవడంతో పోలీసులు విడిచిపెట్టారు.
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు పోలీసులు నేతల వాహనాలను ఆపి సోదాలు చేయడం సర్వసాధారణ విషయమే. కనుక ఇదేమీ పెద్ద విశేషం కాదు. కానీ రాష్ట్రంలో వైసీపి ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నవారు అప్పుడే తమ నియోజకవర్గాలలో ఓటర్లకు ఏదో పేరుతో బహుమతులు, డబ్బు పంచిపెడుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలే స్వయంగా ఓటర్లకు బహుమతులు పంచుతున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో కూడా వస్తున్నాయి. కానీ పోలీసులకు వారిని అడిగే ధైర్యం లేకపోవడంతో చూసి చూడన్నట్లు ఊరుకుంటున్నారు.
వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలని, లేకుంటే చర్యలు తప్పవని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీన హెచ్చరించారు. కానీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత నుంచే నియోజకవర్గాలలో వాలంటీర్ల హడావుడి ఇంకా పెరిగిపోయింది.
వైసీపి నేతల ఒత్తిళ్ళు భరించలేక మహిళా వాలంటీర్లు రాత్రిపూట రహస్యంగా వైసీపి తరపున ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇటీవల కుప్పం నియోజకవర్గంలో రాత్రిపూట మహిళా వాలంటీర్ ఎన్నికల ప్రచారం చేయబోతే స్థానికులు నిలదీయడంతో ఆమె తన గోడు మొరపెట్టుకొని వెళ్ళిపోయారు.
మళ్ళీ వైసీపిని గెలిపిస్తేనే సంక్షేమ పధకాలు వస్తాయని లేకుంటే అన్నీ పోగొట్టుకుంటారని గ్రామాలలో ప్రచారం చేస్తున్న వాలంటీర్లు గ్రామీణులను సున్నితంగా హెచ్చరిస్తున్నారు.
సంక్షేమ పధకాల గురించి వైసీపి అభ్యర్ధులు, కార్యకర్తలు చెప్పుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటూ వైసీపి తరపున ప్రచారం చేస్తుండటమే తప్పు. ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉండాలని ఎన్నికల సంఘం హెచ్చరిస్తున్నా, ప్రచారం చేస్తుండటం ఇంకా తప్పు.
గోనెగండ్ల మండలంలో వేముగోడు గ్రామంలో ఏడుగురు గ్రామ వాలంటీర్లు వైసీపి తరపున ఎన్నికల ప్రచారం చేసిన్నట్లు తెలియడంతో వారిని అధికారులు సస్పెండ్ చేయడమే ఇందుకు తాజా నిదర్శనం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లతో వైసీపి సంక్షేమ పధకాలపేరుతో ఎన్నికల ప్రచారం చేయిస్తున్నప్పటికీ ఎన్నికల సంఘం పెద్దగా పట్టించుకోవడం లేదు. తమ దృష్టికి వచ్చిన వారిపై మాత్రమే వేటు వేసి మమ అనిపించేస్తోంది.
ఎన్నికల ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటికీ దానిని కేవలం ప్రతిపక్షాలకు మాత్రమే వర్తింపజేస్తూ, అధికార పార్టీ సేవలో తరిస్తున్న అధికారులు ఇంకెంతకాలం వైసీపికి ఊడిగం చేస్తారు?






