వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో వ్యవహారం ముగింపుకి చేరుకొన్నట్లే కనిపిస్తోంది. ఈ వ్యవహారంపై అనంతపురం ఎస్పీ ఫకీరప్ప ఈరోజు చెప్పింది వింటే వైసీపీ ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని అటకెక్కించబోతున్నట్లు స్పష్టం అవుతోంది.
“ఈ నెల 4వ తేదీన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అభిమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశాం. ఆగస్ట్ 3వ తేదీ రాత్రి 3 గంటలకు ఆ వీడియో తొలిసారిగా సోషల్ మీడియాలో అప్‌లోడ్ అయినట్లు గుర్తించాము. దానిని యూకేకి చెందిన ఓ ఫోన్ ద్వారా అప్‌లోడ్ చేసినట్లు గుర్తించాము. ఆ తర్వాత దానిని ఐ-టిడిపి వాట్సప్ గ్రూపులో ఫార్వర్డ్ చేసింది. అదే మళ్ళీ సోషల్ మీడియాలోకి అప్‌లోడ్ చేసినట్లు గుర్తించాము. ఆ తర్వాత ఆ వీడియో చాలాసార్లు చాలా గ్రూపులకి ఫార్వర్డ్ చేయబడింది.
అయితే ఆ వీడియోలేవీ ఒరిజినల్ కావు. కనుక ఒరిజినల్ దొరికితే తప్ప అది నిజమైనదా లేక మార్ఫింగ్ చేయబడినదా?అని చెప్పలేము. కానీ ఆ వీడియోను యూకేలో ఎడిటింగ్ చేసి ఉండవచ్చని గ్రహించాము. కనుక ముందుగా యూకేకి చెందిన ఓ ఫోన్ ఎవరిది? దానికి ఈ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది?అనే విషయాలు తెలుసుకోవలసి ఉంది. దానిపై దర్యాప్తు జరుపుతున్నాం.
ఈ వీడియో వ్యవహారంపై వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కానీ మరెవరూ గానీ మాకు ఫిర్యాదు చేయలేదు. ఒకవేళ ఎవరిదగ్గరైనా ఆ ఒరిజినల్ వీడియో ఉన్నట్లయితే మాకు అందజేస్తే మేము ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించి, ఆ నివేదిక ఆదారంగా బాధ్యులపై చర్యలు తీసుకొంటాము,” అని చెప్పారు.
ఇంతకాలం మంత్రులు, సజ్జల రామకృష్ణారెడ్డి ఫోరెన్సిక్ నివేదికలో ఎంపీ తప్పు చేసినట్లు తేలితే చర్యలు తీసుకొంటామని చెప్పారు. కానీ ఎస్పీ ఫకీరప్ప అసలు ఇంతవరకు ఆ వీడియో తమ చేతికే అందనేలేదని, అది ఎక్కడ ఉందో, ఎవరు తీశారో కూడా తెలీదని, ఎవరి దగ్గరైనా ఉంటే ఆ వీడియో ఉంటే తెచ్చివ్వాలని చెప్పడం చూస్తే ఇన్నిరోజులుగా వైసీపీ నేతలు చెపుతున్నవన్నీ సమయం సంపాదించుకోవడానికి చెపుతున్న వట్టి కబుర్లే అని స్పష్టమవుతోంది. ఆ ఒరిజినల్ వీడియో దొరకలేదు కనుక ఈ కధ ఇక్కడితో సమాప్తం అయిపోయినట్లే. సూపర్ హిట్ అయిన గోరంట్ల షోకు తెర పడినట్లే. వారం రోజులలోపే ఈ కేసును అటకెక్కించేసినట్లే!



