రాజకీయ విమర్శలకు, వ్యక్తిగత విమర్శలకు తేడా తెలియని కరుడుగట్టిన వైసీపీ నేతలలో ఒకరైన పోసాని నానాటికి తన హద్దులు దాటి విమర్శలు చేస్తున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు తో మొదలుపెట్టిన ఈయన గారి బూతుల దాడి జనసేన అధినేత పవన్, అక్కడి నుండి ఆయన వ్యక్తిగత వ్యవహారాల వరకు విస్తరించింది.
ఇక ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో తన విమర్శల దాడిని మరో స్థాయికి పెంచాలి అని భావించిన పోసాని మెగా స్టార్ చిరంజీవి ని టార్గెట్ చేసారు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ఉండి పవన్ గెలుపు కోసం గాజు గ్లాస్ గుర్తు పై ఓటేయాలి అంటూ పిఠాపురం ప్రజలను ఉద్దేశించి చిరంజీవి ఒక వీడియో సందేశం పంపారు. ఇక తిట్టడానికి సాకు దొరికినట్లే అని భావించిన వైసీపీ పోసానిని రంగంలోకి దింపింది.
బాబు ని విమర్శించాలన్న, పవన్ ను దూషించాలన్నా వారి సామజిక వర్గానికి చెందిన నేతలనే మీడియా ముందు ఎరేసే జగన్ ఇప్పుడు రాజకీయాలకు సన్యాసం ఇచ్చిన చిరుని టార్గెట్ చేయాలంటే సినీ పరిశ్రమకు సన్యాసం ఇచ్చిన పోసానిని తెర మీదకు తెచ్చింది. ఇక మీడియా ముందుకొచ్చిన పోసాని తన అధినేత ఆదేశాల మేర వచ్చిన పని పూర్తి చేసి వెళ్లారు.
మెగా స్టార్ చిరంజీవి సినిమాలను, రాజకీయాలను బిజినెస్ గానే చూస్తారని, ప్రజారాజ్యం తో 18 ఎమ్మెల్యే సీట్లు గెలిచిన చిరు ప్రతిపక్ష పాత్ర పోషించకుండా పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రి పదవిని దక్కించుకున్నారు. ఈయనకు రాజకీయాల మీద చిత్తశుద్ధి లేదు. తనను నమ్మి ఓటేసిన కాపు సమాజాన్ని మోసం చేసిన చిరంజీవి తన తమ్ముడికి ఓటేసి గెలిపించాలంటూ ఎలా అడుగుతారు..? రాజకీయాల గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా చిరంజీవికి లేదంటూ తన స్థాయిని మరిచి హద్దులు దాటిన విమర్శలు చేసాడు పోసాని.
అసలు తెలంగాణలో ఉంటూ అక్కడ ఓటు హక్కు వినియోగించుకుంటూ ఏపీ రాజకీయాల గురించి మాట్లాడే నైతిక హక్కు పోసాని కృష్ణ మురళికి ఉందా..? గతంలో పవన్ కన్నా తన అన్న చిరంజీవి వెయ్యి రెట్లు మేలంటు కితాబిచ్చిన పోసాని ఇప్పుడు అదే చిరంజీవి గురించి ఈ విధంగా మాట మార్చడం చిత్తశుద్ధి అవుతుందా..? ఇప్పటికే హద్దులు దాటిన విమర్శలు చేస్తూ అటు ప్రజలలో పలుచనై, ఇటు సినీ ఇండస్ట్రీ కి దూరమై పోసాని సమాజంలో ఒక విలువలు లేని వ్యక్తిగా మిగిలి పోయారు.
సర్వేలన్నీ కూటమి పార్టీ అధికారంలోకి రాబోతుంది అంటూ నొక్కి వక్కాణిస్తున్నా, సర్వే ఫలితాలకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ బలం చేకూరుస్తున్నా, ఒక్కో వైసీపీ నేత తన నోటికి ప్లాస్టర్ వేస్తున్నా, సాక్ష్యాత్తు జగనే పునరాలోచనలో పడ్డా పోసాని మాత్రం భవిష్యత్తు ఉహించకుండా తనకొచ్చిన స్క్రిప్ట్ అనుసరించి ఇలా నోరుపారేసుకోవడం ఆయన తలరాతలో భాగంగానే చెప్పాలి. రేపు ఎన్నికల ఫలితాలలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పోసానిని రక్షించడానికి జగన్ వస్తాడు అనే భ్రమలో పోసాని భవిష్యత్తుని ఊహించలేక పోతున్నారు అంటున్నారు మెగా అభిమానులు.






