‘యంగ్ రెబల్ స్టార్’ ప్రభాస్ ప్రస్తుతం “బాహుబలి – ది కన్ క్లూజన్” సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఎలాంటి ఇతర కార్యక్రమాలు పెట్టుకోవద్దని దర్శకుడు రాజమౌళి చెప్పడంతో… గత రెండేళ్ళుగా ‘బాహుబలి’ కోసమే కేటాయిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇక ‘బాహుబలి – ది కన్ క్లూజన్’ సినిమా షూటింగ్ కు ‘గుమ్మడికాయ’ కొట్టే తరుణం ఆసన్నమైంది. జక్కన్న చెప్పిన ప్రకారం డిసెంబర్ నెలాఖరు నాటికి ఈ సినిమా షూటింగ్ ను ముగించేస్తామని, తర్వాత మూడు నెలలు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కు కేటాయిస్తామని చెప్పడంతో ‘బాహుబలి’ షూటింగ్ తుదిదశకు చేరుకుంది.
అనుకున్న విధంగా కాకపోయినా… ఓ పది రోజులు అటు ఇటుగా ‘బాహుబలి’ సినిమా షూటింగ్ ముగియనుందని సినీ వర్గాలు చెప్తున్నాయి. ఈ సినిమా ముగిసిన తర్వాత ‘యంగ్ రెబల్ స్టార్’ వివాహ వార్త అభిమానులను పలకరించబోతోందని సమాచారం. ప్రస్తుత వివరాల ప్రకారం 2017 సంక్రాంతి సమయంలో అధికారిక పెళ్లి వార్త ఉంటుందని, అలాగే ‘బాహుబలి’ విడుదల తర్వాత పెళ్లి జరుగుతుందని తెలుస్తోంది. ‘టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్’గా ప్రభాస్ కున్న క్రేజ్ తెలియనిది కాదు. గతంలో భీమవరంకు చెందిన ఓ కాలేజీ స్టూడెంట్ ప్రభాస్ కు జోడిగా పెద్దలు నిశ్చయించారని వార్తలు హల్చల్ చేసినప్పటికీ అధికారికంగా ఏదీ వెల్లడికాలేదు.
దీంతో యంగ్ రెబల్ స్టార్ పక్కన రియల్ లైఫ్ హీరోయిన్ ఎవరా…? అన్న విషయం త్వరలో బ్రేక్ కావచ్చు. తమ హీరో పరిణయ వేడుక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది గుడ్ న్యూస్. అయితే అధికారికంగా ఖరారైన నాడు మరింత ఆనందదాయకంగా పండగ చేసుకుంటారు. జనవరిలో పెళ్లి ప్రకటన తర్వాత సుజీత్ దర్శకత్వంలో 150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోయే సినిమాలో ప్రభాస్ నటించనున్నాడు. ‘బాహుబలి’ మాదిరే విభిన్న భాషల్లో నిర్మాణం జరుపుకోనున్న ఈ సినిమాను ప్రభాస్ సన్నిహితులు యువీ క్రియేషన్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న విషయం తెలిసిందే.



