సెంటిమెంట్: ఎవరైనా వాడుకోవచ్చు!

Prashant Kishor highlights Bihar sentiment in politics against Congress and Revanth Reddy

సినిమా వాళ్ళకి హైదరాబాద్‌లోని పాత అల్యూమినియం ఫ్యాక్టరీలో ఒక్క సీన్ తీస్తే సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే సెంటిమెంట్.

కొందరు రాజకీయ నాయకులకు పాదయాత్ర చేస్తే తప్పకుండా ముఖ్యమంత్రి అవుతామనే సెంటిమెంట్. మరికొందరికి ఒక్కసారైనా జైలుకి వెళితేనే ముఖ్యమంత్రి అవుతామనే గట్టి నమ్మకం.

ADVERTISEMENT

బీఆర్ఎస్‌ పార్టీకి తెలంగాణ సెంటిమెంట్… ఇలా ఒక్కొక్కరికీ ఒక్కో రకం సెంటిమెంట్ ఉంటుంది.

కనుక సెంటిమెంట్ ఎవరి సొంతం కాదు… ఎవరికైనా ఉండొచ్చు… ఎలాగైనా వాడుకోవచ్చు.

ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్ సొంత కుంపటి (పార్టీ) పెట్టుకొని ఏడాదిగా తన్న సొంత రాష్ట్రం బీహార్‌లో రాజకీయాలు చేస్తున్నారు. త్వరలో జరుగబోయే శాసనసభ ఎన్నికలలో ఆయన పార్టీ పోటీ చేయబోతోంది. కనుక ఆయన కాంగ్రెస్‌ పార్టీపై ‘బీహారీ సెంటిమెంట్ అస్త్రం‘ ప్రయోగిస్తున్నారు.

కాంగ్రెస్‌ పార్టీకి బీహారీలంటే చాలా చిన్నచూపని అటువంటి పార్టీకి ఎందుకు ఓట్లు వేయాలని ప్రశ్నిస్తున్నారు. బిహారీలు కూలీ పనులు చేసేందుకు మాత్రమే పనికివస్తారని మాట్లాడిన తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డిని బీహార్‌ తీసుకువచ్చి రాహుల్ గాంధీ బీహారీలను అవమానించారని వాదిస్తున్నారు.

అయినా తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డికి బీహార్‌లో ఏం పని?అసలు అయన ఇక్కడకి ఎందుకు వచ్చారు? కాంగ్రెస్‌ నేతలు గ్రామాలకు వస్తే ప్రజలు తరిమికొడతారని ప్రశాంత్ కిషోర్ అన్యాపదేశంగా ప్రజలకు సూచిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ ‘బీహారీ సెంటిమెంట్’ వర్కవుట్ అవుతుందో లేదో ఎన్నికలు జరిగితే తెలుస్తుంది.

ఆయన ఈ సెంటిమెంట్ ప్రయోగం బాగానే ఉంది కానీ ఇదివరకు ఆయన ఏపీతో సహా దేశంలో పలు రాష్ట్రాలలో పలు రాజకీయ పార్టీల కోసం పనిచేశారు కదా? నేటికీ ఆయన అవశేషం ‘ఐప్యాక్’ ఏపీలో వైసీపీ కోసం పనిచేస్తూనే ఉంది.

ఇతర రాష్ట్రాలలో వేర్వేరు పార్టీలకు పనిచేయడం ఆయనకు తప్పుగా అనిపించలేదు. కానీ రేవంత్ రెడ్డి బీహార్‌లో పర్యటిస్తే తప్పుగా అనిపిస్తోంది. అంటే ప్రశాంత్ కిషోర్ కూడా అచ్చం కేసీఆర్‌లాగే వ్యవహరిస్తున్నారన్న మాట! కనుక సెంటిమెంట్ ఎవరి సొత్తు కాదన్న మాట!

ADVERTISEMENT
Latest Stories