అందరికీ శకునం చెప్పే బల్లి కుడితి గోలెంలో పడి చచ్చిందన్నట్లు, ప్రశాంత్ కిషోర్ పరిస్థితి కూడా అలాగే ఉందిపుడు. దేశంలో కాంగ్రెస్, బీజేపిలతో సహా అనేక రాజకీయ పార్టీలకు ఎన్నికల వ్యూహ నిపుణుడుగా పనిచేశారు. అవి అధికారంలోకి రావడానికి తోడ్పడ్డారు. కనుక ‘గెలుపు ఫార్ముల’ అయన కంటతః వచ్చేసే ఉంటుంది. ఆ ధైర్యంతోనే అయన తన సొంత రాష్ట్రం బీహార్‌లో ‘జన్ సూరజ్’ని పెట్టుకున్నారు.
ఇంతకాలంగా ఇతర పార్టీల భుజాలపై తుపాకి పెట్టి కాంగ్రెస్, బీజేపి కూటములను కాల్చేవారు. ఒకవేళ గురి తప్పినా ఆయనకేమీ నష్టం కలిగేది కాదు. ఆయనను వాడుకొని అధికారంలోకి వచ్చేద్దామనుకున్న ఆశ పడిన పార్టీలకే ఆ ఎదురు దెబ్బలు తగిలేవి.
కానీ ఇప్పుడు ఆయనే తుపాకీ పట్టుకొని బరిలో దిగాల్సి వచ్చింది. కనుక దెబ్బలు నేరుగా ఆయనకే తగులుతున్నాయి. బీహార్ శాసనసభ ఎన్నికలలో తన పార్టీని ఎన్నికలలో గెలిపించుకునేందుకు ప్రశాంత్ కిషోర్ ఎదురీదుతున్నారు.
కానీ ఎన్నికలలో పోటీ చేయకుండా ముందే జాగ్రత్త పడ్డారు. దేనికంటే తాను పోటీ చేస్తే పార్టీ అభ్యర్ధుల కొరకు పూర్తి సమయం కేటాయించలేనని చెప్పుకుంటున్నారు.
కానీ దేశంలో అన్ని పార్టీల అధ్యక్షులు ఎన్నికలలో పోటీ చేస్తూనే ఉన్నారు. తమ పార్టీలను గెలిపించుకుంటూనే ఉన్నారు కదా?మరి మహా మేధావి అయిన ప్రశాంత్ కిషోర్ ఎందుకు పోటీ చేయడం లేదు? అనే ప్రశ్నకు అయన వద్ద సంతృప్తికరమైన సమాధానం లేదు.
కానీ అయన ఎన్నికలలో పోటీ చేయకపోవడమే మంచిదైంది. ఎందుకంటే ఆయనకు పశ్చిమ బెంగాల్, బీహార్ రెండు రాష్ట్రాలలో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారనే పిర్యాదు రావడంతో, వివరణ కోరుతూ ఈసీ ఆయనకు నోటీస్ పంపింది.
ఒకవేళ అయన ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్నట్లయితే ఎన్నికల నిబంధన ఉల్లంఘించినందుకు ఈసీ అనర్హుడుగా ప్రకటించి ఉండేది. కనుక ఆయన త్రుటిలో ఈ ప్రమాదం తప్పించుకున్నట్లే.
ఈ ఎన్నికలలో అయన తన పార్టీని గెలిపించుకోలేకపోతే అందరూ ఎలాగూ నవ్వుతారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ, ఏపీలో వైసీపీ ఓడిపోతాయని ముందే రాజకీయ జోస్యం చెప్పిన ప్రశాంత్ కిషోర్ సొంత పార్టీ జాతకం చూసుకోలేదా?అనే ప్రశ్న వినిపిస్తుంది.
కానీ ఈ ఎన్నికలలో జన్ సూరజ్ పార్టీ గెలవలేకపోయినా, కాంగ్రెస్, బీజేపి కూటముల ఓట్లు చీల్చి నష్టం చేయగలరు. అప్పుడు ఆయన చేతిలో కనీసం 20-30 సీట్లు ఉన్నా ‘కింగ్ మేకర్’గా నిలువవచ్చు. జన సూరజ్… దాని అధినేత ప్రశాంత్ కిషోర్ జాతకం నవంబర్ 14న ఫలితాలు వెలువడితే తెలుస్తుంది. ఆయన కింగ్ అవుతారో కింగ్ మేకర్ అవుతారో లేదా డిపాజిట్లు కూడా దక్కించుకోలేక చతికిల పడతారో?త్వరలోనే అందరం చూస్తాం.




