అప్పుడు గెలిపించిన ప్రశాంత్ కిషోరే ఇప్పుడు…

Prashant Kishor ap

గత ఎన్నికలలో జగన్మోహన్‌ రెడ్డి (వైసీపి) గెలుపుకి ముఖ్య కారకులలో ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్‌ కూడా ఒకరు. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలనే జగన్‌ కలను ఆయన నెరవేర్చారు. కానీ ప్రశాంత్ కిషోర్‌ ఈసారి ఎన్నికలలో జగన్మోహన్‌ రెడ్డి ఘోర పరాజయం పాలవుతారని కుండ బద్దలు కొట్టారు.

ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్‌ ఆర్‌టీవీకి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో, “సుమారు ఏడాదిన్నర క్రితమే జగన్మోహన్‌ రెడ్డి ఢిల్లీకి వచ్చినప్పుడు నన్ను కలిశారు. అప్పుడే నేను ఆయనకు ఈసారి ఎన్నికలలో వైసీపి ఓడిపోబోతోందని చెప్పాను. కానీ ఆయన అంగీకరించలేదు. 175 సీట్లు గెలుచుకుంటామని చెప్పారు. 175 సీట్లు గెలుచుకుంటామనే నమ్మకం ఉన్నప్పుడు మళ్ళీ నన్ను ఎందుకు సలహా అడగడటం?అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేదు.

ADVERTISEMENT

జగన్మోహన్‌ రెడ్డి ఇంత భారీ మెజార్టీతో గెలిచి అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజల అవసరాలు, ఆకాంక్షలు అర్ధం చేసుకొని వాటికి అనుగుణంగా పరిపాలించి ఉండాలి. కానీ ఆయన ఏమనుకున్నారంటే, నేను ఓ ‘ప్రొవైడర్’ని. ప్రజలకు పధకాల పేరుతో డబ్బు పంచుకుంటూ పోతే చాలనుకున్నారు.

అందుకు అప్పులు చేసినా పర్వాలేదు. రాష్ట్రంలో రోడ్లు వేయకపోయినా పర్వాలేదు. యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించకపోయినా పర్వాలేదు. రాష్ట్రానికి రాజధాని లేకపోయినా పర్వాలేదనుకున్నారు. ప్రజలకు డబ్బులు పంచి వారి అవసరాలు తీరిస్తే చాలు రాష్ట్రంలో ఏమైనా పోయిన పర్వాలేదని అనుకున్నారు. ఈవిదంగా చేసినందుకు ప్రజలందరూ మళ్ళీ తనకే ఓట్లు వేసి గెలిపించుకుంటారని జగన్మోహన్‌ రెడ్డి బలంగా నమ్మారు.

ఈవిదంగా ముందుకు సాగుతూ తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు దేనినీ సరిదిద్దుకోవడానికి ఆయనకు సమయం లేదు. కనుక ఈ తప్పులకు ఆయన ఈ ఎన్నికలలో భారీ మూల్యం చెల్లించబోతున్నారు.

నాకూ, జగన్మోహన్‌ రెడ్డి మద్య చెడింది కనుకనే ఈవిదంగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నాననే వాదనను ప్రశాంత్ కిషోర్‌ ఖండించారు. గత ఎన్నికల తర్వాత తాను మళ్ళీ ఆంధ్రాకు రాలేదని ఏ పార్టీ కోసం పనిచేయలేదని అటువంటప్పుడు జగన్మోహన్‌ రెడ్డితో తనకు విరోధం ఏముంటుందని ప్రశ్నించారు.

తాను తన అనుభవంతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిస్థితులను అధ్యయనం చేసి ఈవిషయం చెపుతున్నాను తప్ప ఏ పార్టీ మీదా ప్రేమా లేదా ద్వేషంతో చెప్పడం లేదని ప్రశాంత్ కిషోర్‌ చెప్పారు.

రేపు జరుగబోయే ఏపీ శాసనసభ ఎన్నికలలో వైసీపికి 51 సీట్లు కూడా రావడం చాలా కష్టమని ప్రశాంత్ కిషోర్‌ తేల్చి చెప్పేశారు. ఒకప్పుడు జగన్మోహన్‌ రెడ్డి, వైసీపి కోసం ఎంతో శ్రమించిన వైఎస్ షర్మిల సైతం ఇప్పుడు అన్నకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారంటే జగన్, వైసీపి పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చని ప్రశాంత్ కిషోర్‌ అన్నారు.

నేను ఎవరు డబ్బు ఇస్తే వారికి అనుగుణంగా మాట్లాడుతానని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన మంత్రిగా బాగా సంపాదించిన్నట్లున్నారు. మరి నాకు డబ్బు ఇచ్చి నాచేత అనుకూలంగా మాట్లాడించుకోవచ్చు కదా?

మొన్న జగన్మోహన్‌ రెడ్డి తల్లి విజయమ్మ కొడుకుని కాదని కూతురు వైఎస్ షర్మిలను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంటే ఆమె కూడా ఎవరి దగ్గరైన డబ్బు తీసుకొని ఆవిదంగా చెప్పారా? వైసీపి నేతలు ఈవిదంగా మూర్కంగా మాట్లాడుతుండటం వలననే ఎక్కడి నుంచి ప్రయాణం మొదలుపెట్టారో మళ్ళీ అక్కడికే చేరుకోబోతున్నారు.

జగన్మోహన్‌ రెడ్డిని ఆయన తల్లి, చెల్లీ కూడా విశ్వసించడం లేదు. ఆయన కూడా ఎవరినీ విశ్వసించడం లేదు. తనను గెలిపించిఓ అధికారం కట్టబెట్టిన ప్రజల పట్ల కూడా ఆయనకు కృతజ్ఞత లేదు. అందుకే ఈసారి శాసనసభ ఎన్నికలలో ఆంధ్ర ప్రజలు ఆయనను గద్దె దించి నాయకుడిని ఎన్నుకోబోతున్నారు,” అని ప్రశాంత్ కిషోర్‌ చెప్పారు.

ADVERTISEMENT
Latest Stories