తెలంగాణలో కాంగ్రెస్‌, బిజెపిలకు ఎప్పుడు అధికారం లభిస్తుందంటే…

Priyanka Gandhi Speechఏఐసీసీ కార్యదర్శి ప్రియాంకా గాంధీ సోమవారం సాయంత్రం హైదరాబాద్‌, సరూర్ నగర్‌లో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన యువ సంఘర్షణ’ బహిరంగసభలో చాలా భావోద్వేగంతో ప్రసంగించి ప్రజలను ఆక్కటుకొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటాలు, బలిదానాలు, ప్రజల ఆకాంక్షలు, సోనియమ్మ తెలంగాణ ఏర్పాటు, కేసీఆర్‌ కుటుంబ పాలన, అవినీతి, దోపిడీ, ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారాలు, నిరుద్యోగ సమస్య, దాని కోసం కేసీఆర్‌ ఇచ్చిన నిరుద్యోగభృతివంటి హామీలు మొదలు దేశం కోసం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ త్యాగాలు వరకు చాలా అంశాలను స్పృశిస్తూ చక్కగా ప్రసంగించి అందరినీ ఆకట్టుకొన్నారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నేర్చుతానని చెప్పి తెలంగాణ తెచ్చుకొన్న కేసీఆర్‌, అవినీతిలో మునిగి తేలుతూ తాను, తన కుటుంబం మాత్రమే బాగుపడ్డారని ప్రియాంకాగాంధీ విమర్శించారు. కనుక కేసీఆర్‌ని గద్దె దించి కాంగ్రెస్‌కి అవకాశం కల్పిస్తే తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే మంచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని, తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ కూతురుగా ప్రజలకు ఈ హామీ ఇస్తున్నానని అన్నారు.

ADVERTISEMENT

తెలంగాణతో సహా దేశ ప్రజలందరూ కాంగ్రెస్‌ పాలన ఏవిదంగా ఉంటుందో కళ్ళారా చూశారు. అలాగే తెలంగాణలో కేసీఆర్‌ పాలన ఏవిదంగా ఉందో కళ్ళారా చూస్తూనే ఉన్నారు. కేసీఆర్‌ పాలనలో శరవేగంగా అభివృద్ధి పనులు పూర్తవుతున్నాయి. వాటి ద్వారా కేసీఆర్‌ కుటుంబానికి,బిఆర్ఎస్‌ నేతలకు బారీగా కమీషన్లు ముడుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అది నిజమే కావచ్చు. కానీ దశాబ్ధాల పాటు సాగిన కాంగ్రెస్‌ పాలన ఇలాంటి అభివృద్ధి ఎన్నడూ చూడలేదు. కనుక ప్రాజెక్టులలో సామాన్య ప్రజల కంటికి కనబడని కమీషన్లు, అవినీతి గురించి పెద్దగా పట్టించుకోవడంలేదనే చెప్పొచ్చు. అదే… కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు అవినీతి ఎక్కువగా కనబడేది అభివృద్ధి తక్కువగా కనబడేది. కనుక కాంగ్రెస్‌ వస్తే అవినీతి ఉండదని ఎవరూ అనుకోరు.

ఏ ప్రభుత్వమూ కూడా రాష్ట్రంలో అందరికీ ప్రభుత్వోద్యోగాలు కల్పించలేదనేది వాస్తవం. ఈ విషయం ప్రతిపక్షాలకు కూడా బాగా తెలుసు. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించడం సులువు కనుక ఈ పేరుతో విమర్శిస్తుంటాయి. రేపు అవి అధికారంలోకి వస్తే, అప్పుడు ప్రతిపక్ష బెంచీలకు మారే అధికార పార్టీలు ఇలాగే విమర్శిస్తుంటాయి. అంటే ఇదొక పార్టీలకు నిరుద్యోగ సమస్య అనేది ఓ రాజకీయ ఆయుదమే తప్ప సమస్య కాదనే భావించవచ్చు.

అయితే దీనికీ కేసీఆర్‌ ప్రభుత్వం ఐ‌టి కంపెనీలు, ప్రైవేట్ రంగంలో పరిశ్రమలు, వాణిజ్య సంస్థల రూపంలో పరిష్కారం చూపుతూనే ఉంది. అందుకే ఏపీతో సహా అన్ని రాష్ట్రాల నుంచి నిరుద్యోగులు ఉద్యోగాల కోసం హైదరాబాద్‌ క్యూ కడుతున్నారు. కనుక ఈ విషయంలో కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ వేలెత్తి చూపలేదు.

నీళ్ళ విషయానికి వస్తే కేసీఆర్‌ 3-4 ఏళ్లలోనే కాళేశ్వరం వంటి అతి భారీ ప్రాజెక్టు కట్టి రాష్ట్రంలో పలు జిల్లాలలో ఏడాది పొడవునా నీళ్ళు పారిస్తున్నారు. కనుక కేసీఆర్‌ ప్రభుత్వం తెలంగాణ సాధనకు కారణమైన నీళ్ళు, నియామకాలను పూర్తి చేస్తున్నట్లుగానే భావించవచ్చు. ఇక తెలంగాణ ఆర్ధిక పరిస్థితి చాలా బలంగా ఉంది కనుకనే కేసీఆర్‌ తలుచుకొన్నదే తడువు వేలకోట్లు పెట్టి సచివాలయం కట్టుకోగలుగుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వంతెనలు, రోడ్లు, పార్కులు, పారిశ్రామిక కారిడర్లు ఏర్పాటు చేయగలుగుతున్నారు. చివరికి పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం దళితబంధు వంటి తలకు మించిన భారం కూడా ఎత్తుకోగలుగుతున్నారు.

ఇవన్నీ కాంగ్రెస్‌ లేదా బిజెపిలు చేయగలవా?అనే ప్రశ్నకు ఆ పార్టీలు సంతృప్తికరమైన జవాబులు చెప్పుకోగలిగితే తెలంగాణలో అధికారం ఆశించవచ్చు. అయినా కేసీఆర్‌తో సహా పార్టీలో దాదాపు సగం మందికిపైగా మంచి మాటకారులున్నారు. వారి చేతిలోనే అధికారం, అంగబలం, అర్ధబలం అన్నీ ఉన్నాయి. కనుక వారిని ఎదుర్కొని ఓడించాలంటే ఒకటే దారి. కేసీఆర్‌, బిఆర్ఎస్‌ నేతల పట్ల ప్రజలకు మొహం మొత్తేయాలి. బహుశః మరో 5 ఏళ్ళవరకు అది జరిగేది కాదు కనుక కాంగ్రెస్‌, బిజెపిలు అంతవరకు ఓపికగా ఎదురుచూడక తప్పకపోవచ్చు.

ADVERTISEMENT
Latest Stories