రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ఎంతటి సంచలనాలు చేయగలరో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నరేంద్ర మోడీ తొలిసారిగా ప్రధాని కావడంలో కీలక భూమిక పోషించిన నాటి నుండి దేశ రాజకీయాలలో ప్రముఖ పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్, అదే బీజేపీకి వ్యతిరేకంగా పని చేసి మమతా బెనర్జీని సీఎం సీటులో కూర్చోబెట్టడంతో, పీకే పేరు మామూలుగా మారుమ్రోగలేదు.
ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కూడా మలుపుతిప్పి దక్షిణాదిలో తన కీర్తి ప్రతిష్టతలను చాటుకున్న ప్రశాంత్ కిషోర్, ప్రస్తుతం కేసీఆర్ తో జత కట్టిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం తెలంగాణాలో ఏం సంభవించినా అది పీకే స్క్రిప్ట్ అన్న ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. దీని వెనుక నిజం ఎంతుందో గానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ ప్రచారం జోరుగా సాగుతోంది.
ప్రశాంత్ కిషోర్ కలిసిన కొన్ని రోజులకే అసెంబ్లీలో కేసీఆర్ ఉద్యోగాల వరాలు కురిపించిన వైనం తెలిసిందే. ఈ వార్తలు తెలంగాణా వ్యాప్తంగానే కాక, ఏపీలోనూ చర్చనీయాంశం అయ్యాయి. అంతలా సందడి చేసిన ఈ ఉద్యోగాల అంశం ఇప్పట్లో సాధ్యమయ్యేది కాదని, మరో రెండేళ్ల తర్వాత ప్రణాళికలు అని ప్రముఖ దినపత్రికలు పతాక శీర్షికలతో ప్రచురించాయి. ఇదంతా ఎన్నికల స్టంట్ గానే కొట్టిపడేసాయి.
ఇదిలా ఉంటే అనారోగ్యంతో కేసీఆర్ యశోద హాస్పిటల్ లో చేరిన విషయం తెలిసిందే. యాంజియోగ్రామ్ చేయాలన్న వార్తలతో కేసీఆర్ గుండెకు ఏమైందో అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమయింది గానీ, ఆ తర్వాత కేసీఆర్ హార్ట్ కు సంబంధించిన అనారోగ్యం లేదని వైద్యులు ప్రకటించిన వార్తలతో టీఆర్ఎస్ వర్గాలన్నీ ఊపిరి పీల్చుకున్నాయి.
ఈ సందర్భంగా కేసీఆర్ హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక్కడే ప్రశాంత్ కిషోర్ పేరు మళ్ళీ వెలుగులోకి వచ్చింది. గతంలో మమతా బెనర్జీ కాలు విరిగినపుడు ఇలాగే బెడ్ పై ఉన్న ఫోటోలు వైరల్ కాగా, ఏపీలో జరిగిన కోడి కత్తి కేసులో జగన్ మోహన్ రెడ్డి పిక్స్ కూడా అంతే సందడి చేసాయి. ఇప్పుడు కేసీఆర్ ఫోటోలు సేమ్ రూట్లో పయనిస్తున్నాయి.
కాకతాళీయమో ఏమో గానీ ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్తగా పార్టీలు నియమించుకోవడం, ఆ తర్వాత పార్టీ అధినేతలు బెడ్ పై ఉండడం చాలా సహజంగా మారిపోతోంది. అందుకే ఇదంతా ప్రశాంత్ కిషోర్ స్క్రిప్ట్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజానిజాలు ఏమిటో ఆ దేవుడికే తెలియాలి గానీ, ప్రస్తుత రాజకీయాలలో ఏది నిజమో, ఏది అసత్యమో నమ్మే పరిస్థితులలో ప్రజలు లేకుండా పోతున్నారు.
అందరికీ ఒకటే స్క్రిప్ట్ ప్రశాంత్ కిషోర్ స్క్రిప్ట్ 😂 pic.twitter.com/8Nj4fW8Opr
— I Love India✌ (@Iloveindia_007) March 11, 2022