పులివెందుల ఎన్నికలను జగన్, వైసీపీ నేతలు ఓ కోణంలో నుంచి చూపిస్తుంటే, సిఎం చంద్రబాబు నాయుడు, నెటిజన్స్ రెండో కోణంలో నుంచి వాస్తవాలు చూపిస్తున్నారు.
ఈ ఎన్నికలలో భారీగా అక్రమాలు జరిగాయంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గొంతు చించుకున్నారు. ఎన్నికలను రద్దు చేసి కేంద్ర బలగాల పర్యవేక్షణలో మళ్ళీ రీపోలింగ్ నిర్వహించాలని జగన్ డిమాండ్ చేశారు.
ఈ ఎన్నికల గురించి సిఎం చంద్రబాబు నాయుడు చెప్పిన విషయాలు అందరినీ చాలా ఆలోచింపజేస్తాయి.
“పులివెందులలో తన ఆటలు సాగనందుకే జగన్ ఇంత అసహనంతో రగిలిపోతున్నారు. నాడు వైఎస్ హయం నుంచే పులివెందులలో ఏకగ్రీవాలు జరుగుతున్నాయి. జగన్ వచ్చిన తర్వాత పులివెందులలో ఎవరికీ నామినేషన్స్ వేసే ధైర్యం ఉండేది కాదు. ఆయన సూచించినవారే నామినేషన్ వేసేవారు. వారే ఏకగ్రీవంగా ఎన్నికవుతూ ఉండేవారు.
పులివెందుల ప్రజలలో దశాబ్దాలుగా నెలకొన్న ఈ భయం పోగొట్టాలనుకున్నాము. అందుకే ఈ ఎన్నికలలో పోటీ చేయాలనుకునే వారందరికీ భద్రత కల్పించాము. అందువల్లే ఈసారి 11 మంది నామినేషన్స్ వేశారు.
రెండు పోలింగ్ బూతులలో అక్రమాలు జరిగాయని పిర్యాదులు రావడంతో ఎన్నికల సంఘం మళ్ళీ రీపోలింగ్ నిర్వహించింది. అంటే పులివెందులలో తొలిసారిగా ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు జరిగాయనే కదా అర్ధం?
తాను కోరుకున్నట్లుగా ఈ ఎన్నికలు జరగాలని జగన్ అనుకున్నారు. కానీ జరగలేదు. అందుకే అసహనంతో రగిలిపోతూ చిన్నా పెద్దా చూడకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు,” అని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
సోషల్ మీడియాలో నెటిజన్స్ ఏమంటున్నారంటే, రాష్ట్ర ప్రజలు 11 సీట్లతో బుద్ధి చెప్పినా జగన్‌కి బుద్ధి రాలేదు. ఇప్పుడు పులివెందుల ప్రజలు కూడా ఆయనకు బుద్ధి చెప్తున్నారు. అయినా మార్పురాదని నిన్న జగన్ మాటలతోనే అర్ధమవుతోంది కదా? అని పలువురు అభిప్రాయపడ్డారు.
తన పులివెందుల అడ్డాలో టీడీపి శ్రేణులు, ఓటర్లు కూడా ఇంత ధైర్యంగా ఎదురు తిరగడంతో జగన్ అహం దెబ్బ తిందని, ఓడిపోబోతున్నామని తెలిసి అయన ‘ఫ్రస్ట్రేషన్’ ఇంకా పెరిగిపోయిందని మరికొందరు అభిప్రాయపడ్డారు.
శాసనసభ ఎన్నికలలో ఓడిపోయినప్పుడు కూడా జగన్‌లో ఇంత ‘ఫ్రస్ట్రేషన్’ కనిపించలేదు. కానీ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల గురించి జగన్ ఇంతగా ఎందుకు ఆవేశపడుతున్నారంటే ఆయన అహం దెబ్బ తినడం వల్లనే అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
జగన్ గురించి సిఎం చంద్రబాబు నాయుడు ఏం చెప్పారో సోషల్ మీడియాలో నెటిజన్స్ కూడా అదే చెపుతున్నారు కదా?




