వైఎస్ కుటుంబానికి రాజకీయ కంచుకోటగా చెప్పుకునే పులివెందులలో ఈ మధ్య కాలంలో వైసీపీ కి ఎదురుగాలి వీసింది. దీనితో స్థానిక వైసీపీ శ్రేణులతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ క్యాడర్ లో కూడా కాస్త ఆత్మస్తైర్యం దెబ్బతిన్న మాట వాస్తవం.
అధికారం చేతిలో ఉంటే ఎవరి కంచుకోటనైనా బద్దలు కొట్టొచ్చు అని నాటి వైసీపీ ప్రభుత్వం బాబు కంచుకోటగా చెప్పుకునే కుప్పంలో చేసి చూపించింది. అయితే కూటమి అధికారంలోకి వచ్చాకా అదే రిటర్న్ గిఫ్ట్ ని టీడీపీ కూడా అంతే స్థాయిలో పులివెందులలో టీడీపీ జెండా ఎగరేసి వైసీపీ పార్టీకి తిరిగిచ్చేసి లెక్క సరిచేసింది.
2025 పులివెందులలో జరిగిన జడ్పీటీసీ ఉపఎన్నికలలో అనూహ్యంగా టీడీపీ నేత బీటెక్ రవి సతీమణి మారెడ్డి లతా రెడ్డి చేతిలో వైసీపీ అభ్యర్థి దివంగత మహేశ్వర రెడ్డి తనయుడు హేమంత్ రెడ్డి ఘోర ఓటమి చెందారు. ఈ నేపథ్యంలో పులివెందులలో వైసీపీ గెలుపు జగన్ రాజకీయ పరువుకు, గౌరవానికి కొలమానంగా మారిపోయింది.
ఇటువంటి తరుణంలో ఇప్పుడు ఏపీలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్ జగన్ పులివెందులలో వైసీపీ గెలుపుని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీనితో పులివెందులలో వైసీపీ ఎట్టి పరిస్థితులలోను టీడీపీ పై రాజకీయంగా పై చేయి సాధించకతప్పని పరిస్థితి ఏర్పడింది.
అందుకోసం జగన్ వైఎస్ కుటుంబం నుంచి మరో వ్యక్తిని రాజకీయ తెరమీదకు తెచ్చారు. జగన్ మరో బాబాయ్ వైఎస్ మనోహర్ రెడ్డి సతీమణి ప్రమీలమ్మను రంగంలోకి దింపారు. పులివెందుల వైసీపీ అభ్యర్థిగా వైఎస్ ప్రమీలమ్మను ప్రకటించింది వైసీపీ.
దీనితో టీడీపీ పులివెందులలో మరోసారి తన సత్తా చాటి నాటి జడ్పీటీసీ ఉపఎన్నికల ఫలితాలను రీ క్రియేట్ చెయ్యగలదా అన్న చర్చ మొదలయ్యింది. ఒకవేళ టీడీపీ జగన్ వ్యూహాన్ని ఛేదించినట్లయితే అది వైసీపీ తో పాటుగా జగన్ రాజకీయ భవిష్యత్ కి, వైఎస్ బ్రాండ్ కి కూడా మాయని మచ్చగానే నిలుస్తుంది సుమీ…!





