గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి వైసీపీ ముఖ్య నాయకులు పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి నాయకత్వంలో కుప్పం లో టీడీపీ ఓటమి కోసం వైసీపీ పక్కా ప్రణాళికలు రచించి అనుకున్న లక్ష్యాన్ని సునాయాసంగా అందుకుంది. కుప్పం మునిసిపాలిటీలో వైఎస్ఆర్ అభ్యర్థి విజయం సాధించడంతో రాష్ట్రంలో టీడీపీ పని కతం అయిపోయింది,
సొంత నియోజకవర్గంలోనే బాబు మున్సిపాలిటీ ని దక్కించుకోలేకపోయారు, ఇది టీడీపీ ఓటమి కాదు బాబు పరాజయం అంటూ నాడు వైసీపీ సోషల్ మీడియా నుంచి మెయిన్ స్ట్రీమ్ నీలి మీడియా వరకు తెగ హంగామా చేసింది. అలాగే వైసీపీ అధినేత జగన్ నుంచి ఆ పార్టీ కార్యకర్త వరకు బాబు ను అవహేళన చేసారు.
అయితే నాటి కుప్పం మున్సీపాలిటీ ఓటమి అవమానాన్ని నేటి పులివెందుల జడ్పీటీసీ గెలుపు గర్వంతో సరి చెయ్యాలని బాబు గట్టి పట్టుదలగా ఉన్నారు. పులివెందులలో టీడీపీ జెండా ఎగరేసి వైసీపీ కుప్పం లెక్క సరిచేయాలని ఆశయంతో టీడీపీ జగన్ నియోజకవర్గమైన పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల మీద ప్రత్యేక ద్రుష్టి పెట్టింది.
నాటి బాబు అవమానానికి, టీడీపీ ఎదురుదెబ్బకు నేడు బదులు చెప్పే రోజువచ్చిందన్నట్టుగా పులివెందుల ఎన్నికలు కూటమికి మంచి అవకాశాన్ని చేతికందించింది. మరి వచ్చిన ఆ అవకాశాన్ని టీడీపీ స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు సద్వినియోగం చేసుకుని వైసీపీ లెక్క సరిచేస్తారా.?
అధినేత చంద్రబాబుకి పులివెందుల జడ్పీటీసీ గెలుపు ని బహుమానంగా అందిస్తారా.? వైసీపీ అందనిస్తుందా.? ప్రభుత్వంలో టీడీపీ ఉన్నప్పటికీ అరాచకంలో వైసీపీ నే పై చేయి సాధించడంతో పులివెందుల గెలుపు అనుకున్నంత ఈజీ కాదనే చెప్పాలి.
అయితే ఈ గెలుపు టీడీపీ కి ఎంత ప్రతిష్టాత్మకమో వైసీపీ కి అంత ప్రాణ సంకటం. చంద్రబాబు కి ఈ విజయం ఎంత గౌరవమో, జగన్ కు ఈ ఓటమి అంత అవమానం. వై నాట్ 175 అన్న వైసీపీ నినాదానికి ప్రజలు 11 తో బదులు చెపితే, వై నాట్ కుప్పం అన్న జగన్ అతి విశ్వాసానికి వై నాట్ పులివెందుల అంటూ బాబు ముందుకెళ్తున్నారు.




