హార్రర్ సినిమా కధల నేపధ్యంలో తెరకెక్కే ‘రాజ్’ సినిమా సిరీస్ లలో భాగంగా సెప్టెంబర్ 16వ తేదీన “రాజ్ – రీబూట్” సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ధియేటిరికల్ ట్రైలర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇమ్రాన్ హష్మి, గురవ్ అరోరా, కృతిఖర్బంద ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ లో హార్రర్ సస్పెన్స్ ఆకట్టుకునే విధంగా ఉంది.
హార్రర్ సినిమాలకు ఆయువుపట్టు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. ఆ విభాగంలో “రాజ్ – రీబూట్” ట్రైలర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్ గా కనపడుతోంది. జీత్ గంగూలీ అందించిన సంగీతం సినిమా సస్పెన్స్ ను ఎలివేట్ చేయడంలో కీలక పాత్ర పోషించగా, అసలు ‘దెయ్యం’ ఎవరు అనే ఆసక్తిని కలిగించడంలో ట్రైలర్ విజయవంతం అయ్యింది. అయితే ఈ సిరీస్ లో తొలుతగా వచ్చిన ‘రాజ్’ సినిమా పోలికలు ఉండడం మైనస్ పాయింట్.
ఇదిలా ఉంచితే, ఇమ్రాన్ హాష్మి సినిమాలంటే ముందుగా ఉండే లిప్ లాక్ లకు కొదవలేదు. బాలీవుడ్ లో బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న కృతి కూడా చిత్ర యూనిట్ కు బాగానే సహకరించినట్లు ట్రైలర్ స్పష్టం చేసింది. ‘తీన్ మార్’తో తెలుగులోనూ పరిచయమైన కృతి, గతేడాది ‘బ్రూస్ లీ’లో చెర్రీకి సోదరిగా నటించిన విషయం తెలిసిందే. దీంతో ఏ ఇండస్ట్రీలోని అవకాశాలు పెద్దగా లేని కృతికి ఈ సినిమా కీలకంగా మారింది. మరి ఆమె ఆశలు సజీవంగా ఉంటాయో లేవో తెలియాలంటే సెప్టెంబర్ 16 వరకు వేచి చూడాల్సిందే.



