రామ బాణానికి తిరుగు ఉండదు. ఖచ్చితంగా లక్ష్యాన్ని చేదిస్తుంది. కానీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు బాణం మాత్రం గురి తప్పిన్నట్లే కనిపిస్తోంది.
ఆయన వైసీపి నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డితో యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఆయన టిడిపి, జనసేనలకు దగ్గరయ్యారు. కనుక వాటిలో ఏదో ఓ పార్టీ తరపున లోక్‌సభ ఎన్నికలలో మళ్ళీ నర్సాపురం నుంచి పోటీ చేయాలనుకున్నారు. చివరికి టిడిపిలో చేరేందుకు సిద్దమయ్యారు. కానీ ఇంకా చేరిన్నట్లు సమాచారం లేదు. ఎందుకు చేరలేదో తెలీదు. కానీ చేరకపోవడం వలన ఆయన నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి.
బీజేపీతో సీట్ల సర్దుబాట్లలో ఆ సీటుని బీజేపీకి ఇచ్చిన్నట్లు తెలుస్తోంది. కానీ తర్వాత ఏలూరు సీటుని బీజేపీకి ఇచ్చి నర్సాపురం టిడిపి తీసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అందుకు బీజేపీ అంగీకరించడం లేదని తెలుస్తోంది.
అందుకు కారణం బీజేపీలో వైసీపి మిత్రులు చక్రం అద్దువేస్తుండటమే అని తెలుస్తోంది. రఘురామ కృష్ణరాజు మొదటి నుంచి మళ్ళీ నర్సాపురం నుంచే పోటీ చేస్తానని చెపుతున్నారు కనుక ఆయన ఏదో విదంగా ఆ సీటు దక్కించుకొనేందుకు ప్రయత్నిస్తారని వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు. కనుక బీజేపీలో సోము వీర్రాజు, జీవీఎల్ వంటి మిత్రుల ద్వారా ఆ సీటు ఆయనకు దక్కకుండా చేసేందుకు జగన్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
ఈ తెర వెనక రాజకీయాలన్నిటినీ పక్కన పెట్టి చూసినట్లయితే, రఘురామ కృష్ణరాజు టిడిపిలో చేరడంలో ఆలస్యం చేసినందునే ఆయనకు ఈ సమస్య ఎదురైన్నట్లు అర్దమవుతోంది. కానీ ఆయన చక్రం తిప్పి ఆ సీటు సాధించుకోగలిగితే ఎన్నికలకు ముందే సగం విజయం సాధించిన్నట్లే! త్వరలోనే ఏపీ బీజేపీ అభ్యర్ధుల జాబితా విడుదలైతే రఘురాముడి బాణం నర్సాపురం లక్ష్యాన్ని చేదించిందో లేదో తేలిపోతుంది.






