రఘురామ కృష్ణరాజుకి బీజేపీ నర్సాపురం టికెట్ ఇవ్వకుండా బీజేపీలో తన మిత్రుల ద్వారా జగన్ అడ్డుకున్నారని ఆయనే స్వయంగా ఆరోపించారు. ఆయనకు టికెట్ ఇప్పించేందుకు లేదా ఆయన కోసం బీజేపీతో ఎంపీ సీట్లు మార్చుకునేందుకు చంద్రబాబు నాయుడు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. కనుక చంద్రబాబు నాయుడు ఆయనను టిడిపిలో చేర్చుకొని పశ్చిమ గోదావరి జిల్లాలోని ‘ఉండి’ శాసనసభ నియోజకవర్గం నుంచి టికెట్ ఖరారు చేశారు.
అయితే ఇప్పటికే ‘ఉండి’ టిడిపి అభ్యర్ధిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజుకి టికెట్ ఖరారు చేసినందున చంద్రబాబు నాయుడు స్వయంగా ఆయనతో మాట్లాడి పరిస్థితి వివరించి ఒప్పించారు. దీంతో ‘ఉండి’ నుంచి రఘురామ కృష్ణరాజు టిడిపి అభ్యర్ధిగా శాసనసభకు పోటీ చేయబోతున్నారు.
వైసీపికి ముఖ్యంగా దాని అధినేతకు ఇది ఊహించని పరిణామమే. నాలుగేళ్ళుగా రఘురామ ఢిల్లీలో కూర్చొని “మా వైసీపి… మా అధినేత జగన్మోహన్ రెడ్డి…” అంటూనే చేస్తున్న విమర్శలు, ఆరోపణలతో, అక్రమస్తుల కేసులలో జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో వేస్తున్న కేసులతో జగన్మోహన్ రెడ్డిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు.
కానీ ఆయన ఢిల్లీలో ఉండటంతో జగన్ కూడా ఏమీ చేయలేకపోయారు. ఆ కక్షతోనే ఇప్పుడు ఆయనకు నర్సాపురం టికెట్ రాకుండా చక్రం తిప్పితే అది కూడా ఇలా బెడిసి కొట్టింది!
రఘురామ కృష్ణరాజు ఢిల్లీలో ఉంటేనే సహించలేకపోయిన జగన్మోహన్ రెడ్డి, రేపు ఆయన ‘ఉండి’ నుంచి గెలిచి శాసనసభలో అడుగుపెడితే సమావేశాలు జరిగిన ప్రతీరోజు ఆయన మొహం చూడాల్సి వస్తుంది. శాసనసభలో జగన్మోహన్ రెడ్డి ఎదురుగా నిలబడి చేసే విమర్శలు, ఆరోపణలు భరించాల్సి ఉంటుంది.
కేసీఆర్ కూడా రేవంత్ రెడ్డిని ఇలాగే ద్వేషిస్తున్నారు. కనుక తాను ముఖ్యమంత్రి హోదాలో శాసనసభలో చూడటం ఇష్టం లేకనే శాసనసభ సమావేశాలకు రావడం మానుకున్నారని సిఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు. రేపు ఏపీ శాసనసభ ఎన్నికలలో వైసీపి ఓడితే, అప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా రఘురామ కృష్ణరాజుని ఇలాగే భరించాల్సి ఉంటుంది లేదా కేసీఆర్‌లాగే శాసనసభ సమావేశాలకు డుమ్మా కొట్టాల్సి ఉంటుంది.
ఒకవేళ మళ్ళీ వైసీపి గెలిచి, ‘ఉండి’ నుంచి రఘురామ కృష్ణరాజు గెలిస్తే కధ మళ్ళీ మొదటికొస్తుంది. ఆయన మళ్ళీ వెంటనే ఢిల్లీ తిరిగి వెళ్ళిపోక తప్పదు.
ఎందుకంటే చంద్రబాబు నాయుడినే జగన్ అరెస్ట్ చేయించారు. రఘురామ కృష్ణరాజు సొంత పార్టీలో ఎంపీగా ఉన్నప్పుడే తన తడాఖా చూపించి ఢిల్లీ పారిపోయేలా చేశారు. కనుక ఒకవేళ జగన్ మళ్ళీ సీఎం అయితే, రఘురామ కృష్ణరాజు ఉండి ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభకు వస్తే విడిచి పెడతారనుకోలేము.
ఏది ఏమైనప్పటికీ రఘురామ కృష్ణరాజుకు టికెట్ దక్కకుండా చేసి రాజకీయంగా దెబ్బ తీయాలని జగన్ ప్రయత్నిస్తే మళ్ళీ పక్కలో బల్లెంలా ‘ఉండి’ నుంచి దిగబడటం దేవుడి స్క్రిప్టే కదా?






