కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ కొత్తగా రాజకీయాల్లోకి రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు ఎత్తుపల్లాలన్నీ చూసిన సీనియర్ రాజకీయ నాయకుడు. ఆయన కోసం తల్లి సోనియా గాంధీ ప్రధానమంత్రి కుర్చీని పదేళ్ళు ‘రిజర్వ్’ చేసి ఉంచారు.
అప్పుడే ఆయన దానిలో కూర్చొని ఉండి ఉంటే నేడు దేశ ప్రధానుల ఫోటోల పక్కన ఆయన ఫోటో కూడా చిరస్థాయిగా ఉండేది. అప్పుడు కాలదన్నిన ప్రధాని పదవి కోసం ఇప్పుడు ఎంతగా ఆశపడుతున్నా దక్కేలా కనిపించడం లేదు. ఎందుకంటే దానిలో నరేంద్ర మోడీ సెటిల్ అయిపోయారు.
కానీ ఎప్పటికైనా రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే తమ ఏకైక లక్ష్యం అంటూ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, నేతలు చెపుతుంటారు. అందుకు సంతోషం కంటే ఆయనపై జాలే కలుగుతుంది.
ప్రధాని మోడీలా ఆయన ఆ కుర్చీని తన శక్తిసామర్ధ్యాలతో సాధించుకోవాలి కదా? కానీ దేశంలో కాంగ్రెస్ నేతలందరూ కలిసి రాహుల్ గాంధీని ఆ కుర్చీలో కూర్చోబెడతామని చెపుతుంటే ఆయనపై జాలే కలుగుతుంది కదా?
ఇంతకీ విషయం రాహుల్ గాంధీ ప్రధాని కావడం గురించి కాదు. ఆయన చాలా సీరియస్‌గా చేసిన చిన్న ‘కామెడీ స్కిట్’ గురించి.
దేశంలో బడుగు బలహీనవర్గాలకు సమానావకశాలు లభించడం లేదని ఆయన చెప్పాలనుకున్నారు. అందుకు చాలా ఉదాహరణలు చెప్పొచ్చు.
కానీ రాహుల్ గాంధీ ఏమన్నారంటే, “ఉదాహరణకి మీరు (ప్రజలు) ఈసారి ఎప్పుడైనా అపోలో కార్పోరేట్ హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే బోర్డులపై పేర్లు ఓసారి చూడండి. వాటిలో ఎక్కడా మీకు ఎస్సీ, ఎస్టీ, బీసీల వైద్యుల పేర్లు కనిపించవు. అన్ని అగ్రకులాల వారివే ఉంటాయి.
నేటికీ దేశంలో బడుగు బలహీనవర్గాలకు సమాన అవకాశాలు లభించడం లేదని చెప్పేందుకు ఇంతకంటే మంచి ఉదాహరణ ఏముంది?” అని రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే అందరూ ముసిముసినవ్వులు నవ్వుకున్నారు. ఎందుకో వివరించక్కర లేదుగా?




