ఆ మద్యన కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. దానిలో వివిధ రాష్ట్రాల ఎన్నికలలో బీజేపి ఏవిదంగా ఓట్లు దొంగతనాలకు పాల్పడుతోందో వివరించారు.
ఒకే ఇంట్లో వందకు పైగా ఓటర్లు, ఒకే పేరు గల వ్యక్తికి రెండు మూడు రాష్ట్రాలలో ఓటర్ కార్డులు జారీ చేయడం వంటివి జరిగాయన్నారు. బీజేపిని వ్యతిరేకించేవారి ఓట్లు మాయం చేసి, ఆ స్థానాలలో ఇతర నియోజకవర్గాలు, జిల్లాలు, రాష్ట్రాలకు చెందిన ఓటర్లను జాబితాలో నమోదు చేయడం వంటి అనేక ఆకృత్యాలకు పాల్పడిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. దీనికి అయన ఫోటోలు, వీడియో సాక్ష్యాధారాలు కూడా చూపించారు. బీజేపి ఓట్ల దొంగతనం చేస్తోందంటూ బీహార్‌లో బైక్‌పై ర్యాలీలలో పాల్గొన్నారు.
ఆయన ఆరోపణలను బీజేపి ఖండించింది. కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునే సత్తా రాహుల్ గాంధీకి లేకపోవడం వల్లనే ఇటువంటి తప్పుడు ఆరోపణలు, దుష్ప్రచారం చేస్తున్నారని ఎదురుదాడి చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం కూడా రాహుల్ ఆరోపణలను ఖండించింది.
ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రాహుల్ గాంధీని అనుకరిస్తూ హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఆయన కూడా తెలంగాణా రాష్ట్రంలో భారీగా ఓట్ల దొంగతనాలు జరుగుతున్నాయంటూ కొన్ని సాక్ష్యాధారాలను చూపారు.
కానీ ఆయన బీజేపిని కాదు కాంగ్రెస్ పార్టీని నిందింస్తున్నారు. త్వరలో జరుగబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో భారీగా ఓట్లు తారుమారు అవుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. ఓట్ల చోరీ గురించి పెద్ద ఉపన్యాసాలు ఇచ్చిన రాహుల్ గాంధీ, ఇప్పుడేమంటారని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు.
అయితే బీఆర్ఎస్ పార్టీ హయంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీగా ఓట్లు దొంగతనం అయ్యాయని, ఆవిధంగానే ఆ పార్టీ రెండుసార్లు ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చిందని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు.
ఎన్నికల సమయంలో ఓట్లు తారుమారు అయ్యాయని వార్తల్లో వినిపిస్తూనే ఉంటుంది. అధికారులు లేదా సాంకేతిక తప్పిదాల వలననే ఓట్లు తారుమారు అవుతున్నాయని ఇంత కాలం ప్రజలు భావిస్తుండేవారు. కానీ అధికారంలో ఉన్న పార్టీలు వేలు, లక్షల సంఖ్యలో ఓట్లను తారుమారు చేసి ఎన్నికలలో గెలిచి అధికారం చేజిక్కించుకుంటున్నాయనే విషయం వారి నోటితో వారే చెబుతున్నారు కదా?
బీజేపిని కాంగ్రెస్, కాంగ్రెస్‌ని బీఆర్ఎస్, బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ ఓట్లు దొంగతనం చేస్తున్నాయని పరస్పరం నిందించుకోవడం చూస్తుంటే ఈ వ్యవహారాలు చాలా కాలంగా సాగుతున్నాయని స్పష్టమవుతోంది. ఎన్నికల ప్రకియ ఈవిదంగా సాగుతున్నట్లయితే ప్రజాస్వామ్య వ్యవస్థలు ఒకటొకటిగా కుప్పకూలిపోయే ప్రమాదం ఉంటుంది.







