కేంద్రమంత్రి సురేశ్ ప్రభు ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ పై ప్రతిపక్షాలు విరుచుకుపడుతుంటే, విశ్లేషకులు, నిపుణులు పెదవి విరిచారు. ఇక, ఏపీ, తెలంగాణా రాష్ట్రాలకు చెందిన వారైతే మండిపడుతున్నారు. ఇంతగా విమర్శలు ఎదుర్కొంటున్న ఈ రైల్వే బడ్జెట్ పై సామాన్య ప్రజలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే… వారు భయపడ్డ అంశాన్ని సురేశ్ ప్రభు గారు బడ్జెట్ లో ప్రవేశ పెట్టలేదు.
ఇటీవల హల్చల్ చేసిన సమాచారాన్ని బట్టి రైల్వే చార్జీలు పెరగడం తధ్యం అని అంతా భావించారు. అయితే ప్రస్తుతానికి ఈ ‘బాదుడు’ గండం నుండి దేశ ప్రజలు గట్టెక్కినట్లే. ఈ ఏడాది రైల్వే బడ్జెట్ విశిష్టత ఏమిటంటే… అసలు బడ్జెట్ లో లేని అంశంపైన దేశ ప్రజలు సంతోషిస్తున్నారు. అయితే బడ్జెట్ లో రూపొందించిన కొన్ని అంశాలు ప్రజలకు ఉపయోగికారిగా ఉన్నాయి గానీ, అవి ఎప్పటి నుండి అమలులోకి నోచుకుంటాయో స్పష్టమైన ప్రకటన కొరవడింది.
ఆ అంశాలను పరిశీలిస్తే… సీనియర్ సిటిజన్లకు ఎదురవుతున్న ఇబ్బందుల రీత్యా వయోవృద్ధులకు లోయర్ బెర్తులు కేటాయింపు, ప్రయాణికులకు స్థానిక ఆహారం ఏర్పాటు చేయడం, చిన్నారుల కోసం ఆహారం, వేడి నీళ్లు సౌకర్యాలు, 139 నంబరు ద్వారా టికెట్ రద్దు, ఒక్క ఎస్ఎంఎస్ తో బోగీ శుభ్రం, మహిళల భద్రత కోసం ప్రత్యేక కాల్ సెంటర్, అన్ని తత్కాల్ సెంటర్ల వద్ద సీసీటీవీ కెమెరాలు వంటి సేవలు ప్రశంసనీయంగా ఉన్నప్పటికీ, ఈ సేవలు ఎప్పటి నుంచీ మొదలవుతాయన్నది ప్రశ్నార్ధకంగా మిగిలింది.





