వైసీపీ ప్రభుత్వం పాలన మొదలుపెట్టిన నాటి నుండి రాష్ట్రంలో ఓట్ల రాజకీయాలు చేస్తూ సంక్షేమ కార్యక్రమాల మీదే ద్రుష్టి పెట్టింది కాని మౌలిక వసతులను రోడ్డుకు వదిలేసిందనే విమర్శ మొదటి నుండి అటు ప్రజల నుండి ఇటు ప్రతిపక్ష పార్టీల నుండి ఎదుర్కుంటూనే వస్తుంది.
అయితే ఏ నొప్పికైనా మాకు ఒకటే మందు అనే మందుబాబుల మాదిరి ఏ సమస్యకైనా కారణం ఒకరే అది చంద్రబాబే అంటూ ఇన్నాళ్లు కాలం నెట్టుకొస్తున్న వైసీపీ పార్టీకి ఇప్పుడు గడ్డుకాలం మొదలయినట్టు ఉంది. ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో అటు అధికార పార్టీ పై యుద్ధం మొదలుపెట్టడానికి ప్రతిపక్షాలతో పోటీ పడి మరి ముందుకొస్తారు సొంత పార్టీ అభ్యర్థులు.
వై నాట్ 175 మాట దేవుడెరుగు ప్రస్తుతానికి ఉన్న సీట్లను గెలిపించుకోవడానికి, తిరిగి అధికార పీఠం దక్కించుకోవడానికి ఇంచార్జ్ ల మార్పుకు శ్రీకారం చుట్టింది వైసీపీ పార్టీ. ఒక పక్క సొంత పార్టీ నేతలే పార్టీకి రాజీనామా చేసి బయటకెళుతుంటే కనీసం ఉన్న వారిని కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్న వైసీపీ ప్రభుత్వానికి ఇప్పుడు రాజమండ్రి రోడ్ల దుస్థితి మరో సమస్యగా మారింది.
రాజమండ్రి గోరక్షణ పేటలో మెయిన్ రోడ్ ఒక్క సారిగా కుంగిపోయింది. దీనితో స్థానిక ప్రజలు వైసీపీ ప్రభుత్వం పై గుర్రుగా ఉన్నారు.గడిచిన నాలుగేళ్లలో ఇదే ప్రాంతంలో ఈ సమస్య రావడం ఇది రెండో సారి కావడంతో వైసీపీ ప్రభుత్వంలో నాణ్యతా ప్రమాణాలు ఎంత చక్కగా ఉంటాయో అనేదానికి ఈ ఒక్క రోడ్డు పరిస్థితి అద్దం పడుతుంది అంటూ ఆందోళన చేస్తున్నారు స్థానికులు.
గతంలో కూడా పైప్ లైన్ పగిలి ఇదే ప్రాంతంలో గొయ్యి ఏర్పడింది. అయితే తిరిగి రోడ్డుకు మరతమ్మత్తులు చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన కొద్దీ కాలానికే మరల గొయ్యలు ఏర్పడడంతో కార్పొరేటర్ల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల కక్రుత్తి, ప్రభుత్వ అలసత్వం కారణంగానే ఈ పరిస్థితి ఉత్పన్నం అయ్యినదంటూ స్థానిక జనసేన నేతలు ప్రభుత్వం పై మండిపడుతున్నారు.
ఇన్నాళ్లుగా గుంతల మధ్య ఉన్న రోడ్డులతో సర్దుకుపోతున్న ప్రజలు ఇక ఇలా కుంగిపోయి స్విమ్మింగ్ ఫూల్ ను తలపిస్తున్న గొయ్యలను దాటి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని ఆశిస్తారేమో అధికార పార్టీ నాయకులు. ఇక ఈ రోడ్ల పై ప్రయాణం చేయడం మా వల్ల కాదు అంటూ ముందు ఇంచార్జ్ లను కాదు రాష్ట్రంలో రోడ్ల దుస్థితిని మార్చండి మహా ప్రభో అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు స్థానిక ప్రజలు.
ఇప్పుడు రాష్ట్ర దుస్థితి మార్చే అవకాశం మీ చేతులలోనే ఉంది మహా ప్రభో అంటూ ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రజలను వేడుకుంటున్నారు. మరి ఎవరి అభ్యర్థనలు నెరవేరుతాయి తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.




