మెగా వారసుడు రామ్ చరణ్ హీరోగా రూపుదిద్దుకుంటున్న ‘ధృవ’ సినిమా తుది మెరుగులు దిద్దుకుంటోంది. డిసెంబర్ 2వ తేదీన రిలీజ్ టార్గెట్ పెట్టుకున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లుగా సమాచారం. ఇటీవల విడుదలైన ఫస్ట్ టీజర్, పబ్లిసిటీ పోస్టర్స్ అంచనాలను మించి ఉండడంతో, ‘ధృవ’పై అంచనాలు ఏర్పడ్డాయి. ‘రేసుగుర్రం’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆడియో విడుదల పోస్టర్ పడింది.
షార్ట్ వేసుకుని తన సైకిల్ పై రకుల్ ప్రీత్ సింగ్ ను ఎక్కించుకున్న పోస్టర్ మెగా అభిమానులను ఆకట్టుకుంటోంది. చూడబోతుంటే… ‘శ్రీమంతుడు’ విజయం తర్వాత టాలీవుడ్ లో ‘సైకిల్’ ఓ ట్రెండ్ సెట్టర్ గా మారినట్లు కనపడుతోంది. హిప్ హాప్ తమిజ్హ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ఆదిత్య మ్యూజిక్ సంస్థ ద్వారా విడుదల కానుంది. ఈ ‘ధృవ’ సినిమాతో తమిజ్హ టాలీవుడ్ తెరంగ్రేటం చేస్తున్నారు. ఆడియో రిలీజ్ డేట్ ను ఇంకా ఖరారు చేయనప్పటికీ, రెండవ వారంలో ఉండవచ్చని ట్రేడ్ టాక్.
ఆడియో ఎప్పుడు వచ్చినా, సినిమా మాత్రం డిసెంబర్ 2వ తేదీనే అని విడుదలకు ముహురాన్ని ఖరారు చేసారు. ఈ సినిమాలో హీరో రామ్ చరణ్ లుక్స్ చాలా డిఫరెంట్ గానూ, అందంగానూ కనపడుతుండడంతో, వాటిని చూసుకుని అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మరి మెగా అభిమానుల అంచనాలను ఈ ‘ధృవ’ అందుకుంటుందో లేదో తెలియాలంటే డిసెంబర్ 2వ తేదీ వరకు వేచిచూడాల్సిందే.



