క్రియేటివిటీకి పరాకాష్ట ఒకరు – రొటీన్ కు ‘బ్రాండ్ అంబాసిడర్’ మరొకరు. కొత్తదనం కోసం పరితపిస్తూ ఎలాంటి రిస్క్ అయినా వెనుకాడని మనస్తత్వం ఒకరిది – ప్రయోగం అంటే పది కిలోమీటర్లు పరిగెత్తే స్వభావం మరొకరిది. మరి వీరిద్దరూ కలిసి సినిమా చేస్తారంటే నమ్మశక్యమేనా? ప్రస్తుతం సుకుమార్ అభిమానుల్లో నెలకున్న సందేహం ఇది.
“నాన్నకు ప్రేమతో” సినిమా ఇచ్చిన జోష్ లో ఉన్న సుకుమార్, తన తదుపరి సినిమాను ఏప్రిల్, మే మాసాలలో ప్రారంభిస్తానని తెలిపారు. అయితే ఎవరితో సినిమా అన్న విషయంపై స్పష్టమైన సంకేతాలు ఇవ్వని సుకుమార్, ప్రస్తుతం చర్చల దశలో ఉన్నాయని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. దేవిశ్రీని హీరోగా పరిచయం చేసే సినిమా ఒకటుంటుందని మాత్రం ఖరారు చేసారు.
అయితే, ఇంతలో రామ్ చరణ్ తో సుకుమార్ సినిమా అంటూ ట్రేడ్ వర్గాల్లో ఓ వార్త హల్చల్ చేస్తోంది. ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కు చేసిన మేకోవర్ తో ముగ్ధుడైన చెర్రీ, సుకుమార్ తో ఓ సినిమా చేయాలనే అభిలాషను వ్యక్తపరిచినట్లుగా తెలుస్తోంది. ఈ వార్త మెగా అభిమానుల్లో ఉత్తేజాన్ని నింపుతున్నా, కొత్తదనానికి ఆస్కారం కల్పించని మెగా క్యాంప్ సుకుమార్ కు ‘క్రియేటివిటీ’ అవకాశాన్ని ఇస్తుందా? అని చర్చించుకుంటున్నారు.





