ప్రస్తుతం ధియేటర్లలో “రాజా ది గ్రేట్” సినిమాతో సందడి చేస్తోన్న మాస్ మాహారాజా రవితేజపై తమిళ దర్శకుడు లక్ష్మణ్ అసంతృప్తి వ్యక్తపరిచారు. తమిళంలో సూపర్ హిట్ సినిమాగా నిలిచిన “బోగన్”ను తెలుగులోకి రీమేక్ చేయడానికి రవితేజ అంగీకరించడంతో, ఆయన బాడీ లాంగ్వేజ్ కు అనుగుణంగా స్క్రిప్ట్ లో పలు మార్పులు చేసానని, అయితే చివరి నిముషంలో ఈ సినిమా చేయనని రవితేజ చెప్పడం విస్మయానికి గురిచేసినట్లుగా చెప్పుకొచ్చారు.
షూటింగ్ మొదలు కావడమే ఆలస్యం అనుకున్న తరుణంలో… అర్ధాంతరంగా రవితేజ ఎందుకు తప్పుకున్నారో తనకు తెలియదని, రవితేజ ఇలా చేయడం సబబు కాదని, అసలెందుకు ఇలా చేసారో కూడా అర్ధం కావడం లేదని, ప్రస్తుతం తాను ఏం చేయాలో కూడా తెలియడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తపరిచారు. తమిళ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాస్ మాహారాజా తీరుపై లక్ష్మణ్ తీవ్రం అసంతృప్తి వ్యక్తం చేయడం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది.


