వాలంటీర్లు ఎందుకు? అంటే ‘తమ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పధకాలను ప్రజల ఇంటి వద్దే అందించడానికి, వారి సమస్యలను సచివాలయాల దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించడానికి’ అని ఇంతకాలం సిఎం జగన్మోహన్ రెడ్డితో సహా వైసీపిలో ప్రతీ ఒక్కరూ చెప్పారు.
కానీ ఎన్నికలు దగ్గర పడగానే ‘వాలంటీర్లే నా సైన్యం… ఈ ఎన్నికలలో వైసీపిని గెలిపించే బాధ్యత మీదే’ అని జగన్ చెప్పేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వాలంటీర్లు అందరూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని హుకుం జారీ చేశారు.
తాజాగా టెక్కలి వైసీపి అభ్యర్ధి దువ్వాడ శ్రీనివాస్ నిన్న పట్టణంలో వాలంటీర్లతో సమావేశం ఏర్పాటు చేసి అందరినీ గట్టిగా హెచ్చరించారు.
“వాలంటీర్లు అందరూ తప్పనిసరిగా మీ ఉద్యోగాలకు రాజీనామాలు చేసి వైసీపి కండువాలు వేసుకొని ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలి. ఇప్పుడు రాజీనామాలు చేసి మాతో వచ్చిన వారికే మేము అధికారంలోకి వచ్చినప్పుడు మళ్ళీ ఉద్యోగాలలోకి తీసుకుంటాము.
ఉద్యోగాలకు రాజీనామాలు చేయకుండా, వైసీపి అభ్యర్ధుల ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా దూరంగా ఉండిపోయిన వారిని మేము పట్టించుకోము. అవసరానికి మాకు ఉపయోగపడని అటువంటి వాలంటీర్లు మాకు అవసరం లేదు.
వాలంటీర్లు అందరి రికార్డులు మా వద్ద ఉన్నాయి. కనుక ఉద్యోగాలకు రాజీనామాలు చేయకపోయినా, వైసీపి ఎన్నికల ప్రచారంలో పాల్గొనక పోయినా మాకు తెలియదనుకోవద్దు. రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు అందరూ రేపటిలోగా తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేసి వైసీపి కండువాలు ధరించి తప్పనిసరిగా ఎన్నికల ప్రచారం పాల్గొనాలి,” అని దువ్వాడ శ్రీనివాస్ హెచ్చరించారు.
వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉండాలని ఈసీ ఆదేశించింది. అలా ఉండని కొందరిపై ఇప్పటికే వేటు వేసింది కూడా.
టిడిపి రంగంలో దిగి వాలంటీర్లు ఎవరూ రాజీనామాలు చేయవద్దని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా వారి సేవలను ఉపయోగించుకుంటామని, వాలంటీర్లకు ప్రస్తుతం జగన్ ప్రభుత్వం ఇస్తున్న రూ.5,000 జీతాన్ని పెంచి నెలకు రూ.10,000 చొప్పున ఇస్తామని ప్రకటించింది.
కానీ మరోపక్క వైసీపి నేతలు ఈవిదంగా బెదిరిస్తున్నారు. ఎన్నికల సంఘం హెచ్చరిస్తున్నా వైసీపి నేతలు వాలంటీర్లను ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని అందుకోసం ఉద్యోగాలకు రాజీనామాలు చేయాలని ఒత్తిడి చేస్తోంది.
వాలంటీర్లను ఉద్యోగాలకు రాజీనామాలు చేయమని ఒత్తిడి చేయడం ఒక నేరం కాగా, ఈసీ ఆదేశాలను పట్టించుకోకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని ఒత్తిడి చేస్తుండటం మరో నేరం. వైసీపి నేతలు ఇంతగా బరీ తెగిస్తున్నా రాష్ట్ర ఎన్నికల సంఘం ఇంతవరకు స్పందించడం లేదు. దీంతో వాలంటీర్ల పరిస్థితి అయోమయంగా మారింది.
వాలంటీర్ వ్యవస్థ త్రిశంకు స్వర్గం వంటిదని, అధికార ప్రతిపక్షాలు ఆడుకునే ఈ రాజకీయ చదరంగంలో తాము పావులుగా మిగిలిపోతామని గ్రహిస్తే వారికే మంచిది.
Duvvada: వాలంటీర్లంతా రాజీనామా చేసి.. వైకాపా కండువాలు కప్పుకోవాలి!: దువ్వాడ శ్రీనివాస్ బెదిరింపులు!#DuvvadaSrinivas #ysrcp #APVolunteers #APNews #TeluguNews pic.twitter.com/zUCivFCg1H
— Eenadu (@eenadulivenews) May 1, 2024




