గౌరవం… కావాలంటే లభిస్తుందా?

kcr---jagan

చాలాసార్లు చెప్పుకున్న మాటే…. అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యానికి కట్టుబడి పాలన చేస్తూ, ప్రతిపక్షాలను మీడియాను గౌరవిస్తే రాజకీయాలలో అదో సత్సంప్రదాయంగా నిలుస్తుంది కనుక ఒకవేళ ఎన్నికలలో అధికార, ప్రతిపక్షాల స్థానాలు మారినా ఎవరికీ ఎటువంటి ఇబ్బందీ ఉండదు.

ADVERTISEMENT

కానీ రాజకీయాలలో ఈ కట్టుబాట్లు, నైతిక విలువలు ఇప్పుడు ఉండట్లేదు. కనుక రాజకీయాలలో ఉన్న ప్రతీ ఒక్కరూ ఏదో సమయంలో బాధితులుగా మారక తప్పడం లేదు.

ఉదాహరణకు జగన్‌ అధికారంలో ఉన్నప్పుడు 23 మంది ఎమ్మెల్యేలున్న టిడిపికి ప్రధాన ప్రతిపక్షహోదా నిరాకరించారు. ఇప్పుడు ఆయనకు 11 మందే ఉన్నారు. కనుక టిడిపి కూటమి ప్రభుత్వం కూడా నిరాకరించింది.

ఒకవేళ అప్పుడు జగన్‌ టిడిపిని, చంద్రబాబు నాయుడుని గౌరవించి ఉండి ఉంటే, నేడు ఆయనకు అంతే గౌరవం లభించి ఉండేది. కానీ ఆనాడు నిండుసభలో చంద్రబాబు నాయుడు అవమానించి బయటకు పోయేలా చేశారు. అందువల్లే నేడు జగన్‌ శాసనసభకు వచ్చేందుకు భయపడుతున్నారని చెప్పవచ్చు.

తెలంగాణలో కేసీఆర్‌ కూడా ప్రతిపక్ష నేతలను, ఎమ్మెల్యేలను బిఆర్ఎస్ పార్టీలో చేర్చుకుని మంత్రి పదవులు ఇచ్చారే తప్ప ఏనాడూ ప్రతిపక్షాలను గౌరవించలేదు. పైగా వారి పట్ల చాలా చులకనగా, అవహేళనగా మాట్లాడుతుండేవారు. కనుకనే ఇప్పుడు ఆయన కూడా శాసనసభలో అడుగుపెట్టడానికి భయపడుతున్నారు.

విషయానికి వస్తే రేపు దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగబోతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా హైదరాబాద్‌లో ఘనంగా ఈ వేడుకలు నిర్వహించబోతోంది. ఆ కార్యక్రమానికి పలువురు ప్రముఖులను ఆహ్వానించింది.

అయితే ఆ ఆహ్వానపత్రంలో ఇటీవల బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌ గూటికి చేరుకున్న కే కేశవరావు (ముఖ్య అతిధి) పేరుని పైన ముద్రించి దిగువన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జాబితాలో 9వ స్థానంలో కె.చంద్రశేఖర్ రావు, శాసనసభ్యులు, గజ్వేల్ అని ముద్రించింది.

దీనిపై బిఆర్ఎస్ పార్టీ స్పందిస్తూ, “సిగ్గు, సిగ్గు! దిగజారుడుతనంలో పరాకాష్టకు చేరుకున్న కాంగ్రెస్. తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ గారి పేరుని ఆహ్వాన పత్రికలో చివర్లో పెట్టి తమ కుంచిత స్వభావాన్ని మరొక్కసారి బయపెట్టుకున్న రేవంత్ సర్కార్…” అంటూ ఆక్షేపించింది.

అయితే తాము అధికారంలో ఉన్నప్పుడు రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నేతలను ఎంతగా అవమానించి, అవహేళన చేశామనే విషయం బిఆర్ఎస్ పార్టీ మరిచిపోయింది. అలాగే జగన్‌ కూడా మరిచిపోయారు. కానీ ఇప్పుడు కేసీఆర్‌, జగన్‌ తమకి గౌరవం కావాలని ఆశిస్తున్నారు. ఎలా లభిస్తుంది?

ADVERTISEMENT
Latest Stories