ఈరోజు మధ్యాహ్నం 1.04 గంటలకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
ముఖ్యమంత్రి పదవికి చివరి వరకు పోటీ పడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భట్టి విక్రమార్కలతో పాటు ఈసారి కాంగ్రెస్ గెలుపులో కీలక పాత్ర పోషించిన, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులకు మంత్రి పదవులు లభించాయి.
అలాగే పార్టీలో సీనియర్లు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, సుదర్శన్ రెడ్డిలకు కూడా మంత్రి పదవులు లభించాయి. రేవంత్ రెడ్డి తన తోడబుట్టిన చెల్లెమ్మలుగా గౌరవించే సీతక్క, కొండా సురేఖలను కూడా మంత్రివర్గంలోకి తీసుకొంటున్నారు.
మంత్రివర్గంలో మొత్తం 17 మంది మంత్రులకు అవకాశం ఉండగా నేడు 11 మంది మాత్రమే ప్రమాణస్వీకరాలు చేయబోతున్నారు. కనుక మిగిలిన 6 మంత్రి పదవులను ఎవరికి ఇవ్వాలనేది రేవంత్ రెడ్డి నిర్ణయానికే కాంగ్రెస్ అధిష్టానం విడిచిపెట్టిన్నట్లు అర్దమవుతోంది. తద్వారా తనకు నచ్చినవారిని లేదా తన ప్రభుత్వాన్ని బ్యాలెన్స్ చేసుకొనేందుకు తోడ్పడేవారికి ఆ పదవులను కేటాయించే అవకాశం ఉంటుంది.
నేడు మంత్రులుగా ప్రమాస్వీకారం చేస్తున్నవారిలో పొంగులేటి, తుమ్మల, సీతక్క, కొండా సురేఖలు రేవంత్ రెడ్డికి పూర్తి అండగా నిలబడతారు. మిగిలిన వారిలో చాలా మంది ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న వారే. మంత్రి పదవుల కోసం వారందరూ రేవంత్ రెడ్డిని అడగకుండా కాంగ్రెస్ అధిష్టానాన్ని అడిగి సంపాదించుకోవడం, అందరూ ఢిల్లీలోనే ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని పట్టించుకోకపోవడమే ఇందుకు తాజా ఉదాహరణలు. కనుక రేవంత్ రెడ్డి తనకు అండగా నిలబడేవారికే ఎక్కువ ప్రాధాన్యం ఈయక తప్పదు.




