రేవంత్ రెడ్డి పై ‘రెడ్డి’ వర్గం నేతల అసమ్మతి.?

Revanth Reddy faces Congress dissent

తెలంగాణ లో రాజ్యాధికారం కాంగ్రెస్ పార్టీకి అందని ద్రాక్షే అనుకున్న సమయంలో ఆ రాజ్యాధికారాన్ని గులాబీ కారు నుంచి కాంగ్రెస్ హస్త గతం చేసారు రేవంత్ రెడ్డి. అసాధ్యమనుకున్న కార్యాన్ని సుసాధ్యం చేసిన నేతగా రేవంత్ కాంగ్రెస్ అధిష్టానం ఆశీస్సులు పొంది అతి చిన్న వయస్సులోనే తెలంగాణ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు.

అయితే నాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేవంత్ ను ఎన్నుకోవడం పార్టీ అధిష్టానానికి ఒక సవాల్ అయితే ఆ ఎన్నికను తనకు అనుకూలంగా మలచుకుంటూ పార్టీలోని సీనియర్ల అసమ్మతిని అణిచివేసి పార్టీని ప్రభుత్వంగా మలచి ముందుకు తీసుకెళ్లడం రేవంత్ కి పులి మీద స్వారీ వంటిదనే చెప్పాలి.

ADVERTISEMENT

అయితే ఇప్పటి వరకు రేవంత్ ఆ స్వారీని తనదైన శైలిలో ముందుకు తీసుకెళుతున్నప్పటికీ ఆ పార్టీ లోని సొంత(రెడ్డి) సామాజికవర్గ నేతలే రేవంత్ కు కంటిలో నలుసు లెక్క తయారవుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జీవన్ ‘రెడ్డి’ రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ పార్టీకి రాజీనామా చేసి కేసీఆర్ గులాబీ కారెక్కారు.

ఇక తనకు రేవంత్ క్యాబినెట్ లో మంత్రి పదవి దక్కలేదనే అసంతృప్తి కోమటిరెడ్డి రాజగోపాల్ నోటికి తాళం వెయ్యలేకపోతుంది. అధికార పార్టీ ఎమ్మెల్యే గా ఉంటూనే పార్టీ మీద ప్రభుత్వం మీద నిత్యం ఎదో ఒక అంశంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ రేవంత్ సర్కార్ పాలిట కొరకు రాని కొయ్యగా మారారు.

మునుగోడు అభివృద్ధి పేరు చెప్పుకుంటూ తనకు మంత్రి పదవి ఉంటే మునుగోడు దశ దిశా మారిపోయేది అంటూ రేవంత్ సర్కార్ కు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. హోమ్ మంత్రి తో మొదలుపెట్టిన రాజగోపాల్ లొల్లి ఇప్పుడు కనీసం ఏదొక శాఖకు మంత్రి ఇస్తే చాలు అనే స్థితికి దిగజారింది.

ఇక వీరిద్దరి కోవలోకే జడ్చర్ల యువ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ ‘రెడ్డి’, సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి చిన్నా ‘రెడ్డి’ సైతం రేవంత్ సర్కార్ పై తమ అసమ్మతి బయటపెడుతున్నారు. పార్టీలో యువ నాయకత్వం ప్రోత్సాహానికి తనకు మంత్రి పదవి అవకాశం కల్పించాలని అనిరుధ్ రెడ్డి స్వరం పెంచుతున్నారు.

ఇక భరిస్తున్నా కాబట్టే ఇంకా పార్టీలో కొనసాగుతున్నా, లేకుంటే మరో జీవన్ రెడ్డి మాదిరి అయ్యేవాడినని, కాంగ్రెస్ పార్టీలో తప్పులు జరుగుతున్నాయని, పార్టీకి అన్యాయం చేస్తున్న వారిని బయటకు పంపించి తీరుతా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు చిన్నా రెడ్డి.

గత నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో తానూ ఒక భాగమని, అటువంటి తనను డబ్బులకు ఆశపడి ఎమ్మెల్యే టికెట్ కు దూరం పెట్టారని, వనపర్తి ని సర్వ నాశనం చేస్తున్నారని, పార్టీ కోసం క్లష్టపడి జెండా మోసినవారిని పక్కన పెట్టి ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారికీ పార్టీ టికెట్లు కేటాయించిందని,

తానూ ఎమ్మెల్యే గా ఎన్నికయ్యి ఉంటే, ప్రభుత్వంలో భాగంగా మంత్రి పదవి దక్కి ఉంటే వనపర్తి కి మహర్దశ పట్టేదంటూ తన ఆవేదనను బహిరంగ పరిచారు చిన్నా రెడ్డి. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రేవంత్ కి వ్యతిరేకంగా ఇలా ఆయన సొంత సామాజికవర్గం నేతలే గళం విప్పడంతో రేవంత్ రెడ్డి సీఎం నాయకత్వాన్ని రెడ్డి వర్గం నేతలు వ్యతిరేకిస్తున్నారా.? అన్న అంశం తెరమీదకొస్తుంది.

రేవంత్ రచ్చ గెలిచినప్పటికీ ఇంట గెలవలేకపోతున్నారా.? రేవంత్ కి సొంత సామాజికవర్గం పోరు ముదురుతుందా.? అయితే ఈ సోకాల్డ్ రెడ్డి నేతలంతా కూడా గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచినవారు కావడంతో వీరంతా కూడా బాబు కు ఆత్మీయుడిగా పేరుపొందిన రెడ్డి నేతను తమ నాయకుడిగా అంగీకరించలేకపోతున్నారా.?

జీవన్ ‘రెడ్డి’ తో మొదలైన ఈ అసమ్మతి రాజగోపాల్ ‘రెడ్డి’, అనిరుధ్ ‘రెడ్డి’, తాజగా చిన్నా ‘రెడ్డి’ వరకు వ్యాపించింది అంటే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి కి వ్యతిరేకంగా తెరవెనుక రాజకీయం నడుస్తుందా.? ఒకవేళ నడిస్తే ఆ రాజకీయానికి నాయకత్వం వహిస్తున్న ఆ నేత ఎవరు.? ఎండు కోసం.? అనే ప్రశ్నలకు రేవంత్ రెడ్డి జవాబు తెలుసుకోవాలి, అందుకు తగ్గ విరుగుడు వేయాలి.

ADVERTISEMENT
Latest Stories