పోలీసులు దొంగలు, గూండాలు, హంతకులపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తుంటారు. కానీ రాజకీయాలలో ఈ పద్దతి వర్తించదు. కేసులు నమోదు, విచారణ, అరెస్ట్ వంటివన్నీ ప్రతిపక్షాలను వేధించేందుకు, నియంత్రించేందుకు, అవసరమైతే పార్టీలో చేర్చుకునేందుకు అధికార పార్టీలకు ఉపయోగించుకుంటాయి.

Also Read – ఇంతకీ ఆ కేసులో కేసీఆర్‌ ఓడారా… గెలిచారా?

ఉదాహరణకు జగన్‌ ప్రభుత్వం చంద్రబాబు నాయుడుతో సహా టిడిపి ముఖ్య నేతలపై కేసులు నమోదు చేసి ఏవిదంగా ఆడుకుందో అందరూ చూశారు.

వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయాలనుకుంటే క్షణాలలో చేయగలదు. కానీ ఆయనను జగన్‌ వెనకేసుకు రావడం వలన కావచ్చు లేదా ఈ కేసు ఆయన నెత్తి మీద వ్రేలాడదీసి ఉంచుతూ వారిరువునీ తమ చెప్పు చేతల్లో ఉంచుకోవాలనే ఢిల్లీ పెద్దల ఆలోచన కావచ్చు హత్య జరిగి 5 ఏళ్ళవుతున్నా అరెస్ట్ చేయడం లేదు.

Also Read – భయపడ్డారా.? భయపెడుతున్నారా.?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కేంద్రం కేసీఆర్‌ని ఏవిదంగా కట్టడి చేస్తోందో అందరూ చూస్తున్నారు. ఆయన టిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ పార్టీగా మార్చుకొని కర్ణాటక శాసనసభ ఎన్నికలలో జెడిఎస్‌ పార్టీ (దేవగౌడ, కుమార స్వామి)లతో కలిసి పోటీ చేయాలనుకున్నారు. కానీ లిక్కర్ కేసులో కూతురుని అరెస్ట్ చేయవచ్చనే హెచ్చరిక అందడంతో చివరి నిమిషంలో వెనక్కు తగ్గారు.

కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన కూతురు కవితకి ఈ లిక్కర్ కేసు నుంచి విముక్తి కల్పించడానికి నలుగురు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీకి ఎర వేసి ముగ్గురు బీజేపీ ప్రతినిధులను అరెస్ట్ చేయించారు. మరో ఇద్దరు పెద్దలని కూడా అరెస్ట్ చేయించి కేంద్రంతో బేరమాడుకోవచ్చని అనుకున్నారు. కానీ ఆయన ప్లాన్ బెడిసి కొట్టిందని ఫోన్ ట్యాపింగ్‌ కేసులో అరెస్ట్ అయిన టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్‌డి రాధాకిషన్ రావు బయటపెట్టారు.

Also Read – ఇలా కొట్టేవారెవరైనా ఉన్నారా..మళ్ళీ ఆయనే ట్రై చెయ్యాలా..?

కేసీఆర్‌ తన ప్రభుత్వాన్ని కూల్చేస్తామని బెదిరిస్తుండటంతో రేవంత్‌ రెడ్డి కూడా ఆయనను కట్టడి చేసేందుకు ఫోన్ ట్యాపింగ్‌ కేసు, కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజిల కేసులను తవ్వితీస్తుండటం చూస్తూనే ఉన్నాము. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా కేసులే ఉన్నాయి.

చివరిగా చెప్పుకోవాల్సిన మరో ముఖ్య విషయం కూడా ఉంది. ఈ కేసులన్నీ కేవలం రాజకీయ ప్రయోజనాలు సాధించడానికే అని స్పష్టమైంది కనుక తమ చేతిలో ఉన్న కేసులను సీబీఐకి అప్పగించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించవు.

ఉదాహరణకు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం తవ్వి వెలికి తీసిన ఫోన్ ట్యాపింగ్‌ కేసులో కేసీఆర్‌ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ రేవంత్‌ రెడ్డికి ధైర్యం చాలకపోతే ఆ కేసుని సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.

ఆ కేసు సీబీఐ చేతికి వస్తే కేసీఆర్‌ పిలక కేంద్రం చేతిలోకి వస్తుందని ఆయన (బీజేపీ) ఆలోచనగా కనబడుతోంది. కానీ ఆ కేసుతోనే కేసీఆర్‌ని కట్టడి చేయాలని రేవంత్‌ రెడ్డి అనుకుంటున్నారు కనుక సీబీఐకి అప్పగించేందుకు అంగీకరించడం లేదు.

అంటే కేసులన్నీ అధికార పార్టీలకు ‘లంకె బిందెలు’ వంటివేనన్నమాట. అవసరమైనప్పుడు బయటకు తీసి వాడుకుంటాయి. లేనప్పుడు అజ్ఞాతవాసంలో పాండవులు తమ ఆయుధాలను జమ్మి చెట్టు మీద దాచిపెట్టిన్నట్లు ఈ కేసులను అటక మీద దాచిపెట్టుకుంటాయన్న మాట!

కనుక ఈ కేసుల పేరుతో సాగే మొత్తం తతంగం, దాని కోసం అయ్యే వేలకోట్ల ఖర్చు, అధికారులు, న్యాయస్థానాల విలువైన శ్రమ, సమయం అన్నీ వృధాయేనా? అనిపించక మానదు.