రేవంత్‌ రెడ్డి ఆ ఒక్క తప్పటడుగు చాలు… బిఆర్ఎస్ పార్టీకి!

KCR Revanth Reddy

అపర చాణక్యుడు, మహా మేధావి, తెలంగాణకు గాంధీ, నెహ్రూ, అంబేడ్కర్ అన్నీ అయిన మాజీ సిఎం కేసీఆర్‌ అంతటి వాడిని రేవంత్‌ రెడ్డి ఓడించి మూల కూర్చోబెట్టారు. కేసీఆర్‌ ఫార్ములానే ఫాలో అయిపోతూ బిఆర్ఎస్ పార్టీని ఖాళీ చేసేస్తున్నారు.

ADVERTISEMENT

అంతేకాదు… కాళేశ్వరం ప్రాజెక్టుతో సహా వివిద అభివృద్ధి పనుల మాటున జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ జరిపిస్తూ కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్ రావు ముగ్గురుకీ ఉచ్చులు సిద్దం చేస్తున్నారు. వారి దురదృష్టమో రేవంత్‌ రెడ్డి అదృష్టమో కానీ వారు ఎంతో గొప్పగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజిలో మూడు పిల్లర్లు క్రుంగిపోయాయి.

వాటిని కూడా రేవంత్‌ రెడ్డి, మంత్రులు బాగానే హైలైట్ చేసి, కేసీఆర్‌ కమీషన్ల కక్కుర్తి వలననే అవి క్రుంగిపోయాయని గట్టిగా వాదిస్తూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా ఏ కాళేశ్వరం ప్రాజెక్టుతో కేసీఆర్‌కు అంతా పేరు ప్రతిష్టలు వచ్చాయో దాంతోనే ఆయనను ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నారు.

అయితే ఈ ప్రయత్నంలో రేవంత్‌ రెడ్డి చాలా పెద్ద తప్పటడుగే వేస్తున్నారని చెప్పక తప్పదు. మేడిగడ్డ బ్యారేజి విషయంలో బిఆర్ఎస్ పార్టీతో ఆయన ఎంతైనా యుద్ధం చేసుకోవచ్చు. కానీ ఈ కారణంగా ఈ ప్రాజెక్టుపైనే ఆధారపడిన వేలాది ఎకరాలకు సాగునీరు అందించలేకపోతున్నారు. దీంతో పంటలు ఎండిపోతున్నాయి. రైతులకు మళ్ళీ సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. కేసీఆర్‌ మూడు పంటలకు పుష్కలంగా నీళ్ళు ఇవ్వగలిగినప్పుడు, రేవంత్‌ రెడ్డి ఇవ్వలేకపోవడాన్ని రైతులు రేవంత్‌ రెడ్డి అలసత్వం, చాతకానితనంగానే భావిస్తారు. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ విషయం గ్రహించినట్లు లేదు.

క్రుంగిన మేడిగడ్డ బ్యారేజిని చూపిస్తూ కేసీఆర్‌ని దెబ్బ తీయాలని రేవంత్‌ రెడ్డి అనుకుంటే, బ్యారేజిలో గత ఏడాది మార్చిలో, ఈ మార్చిలో ఎంత నీరు ఉండేదో తెలియజేస్తూ బిఆర్ఎస్ పార్టీ ఫోటోలు సోషల్ మీడియాలో పెడుతోంది. “ఇది కాంగ్రెస్‌ సృష్టించిన కరువు,” అంటూ ట్వీట్‌ చేస్తోంది.

రేవంత్‌ రెడ్డికి బిఆర్ఎస్ పార్టీ నేతలను కాంగ్రెస్‌లోకి ఫిరాయింపజేసుకోవడంపై ఉన్న శ్రద్ద, సాగునీరు లేక అవస్థలు పడుతున్న రైతులపై లేదని, అందుకు ఈ బీడువారుతున్న ఈ పొలాలే సాక్ష్యం అంటూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతోంది.

బిఆర్ఎస్, కాంగ్రెస్‌ పార్టీలు ఎంతగా కత్తులు దూసుకున్నప్పటికీ వాటి వలన సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగనంత వరకే పట్టించుకోకుండా ఉంటారు. కానీ ఈవిదంగా నష్టపోతుంటే రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత చాలా వేగంగా పెరిగిపోతుంది. ఇదే జరిగితే అప్పుడు తెలంగాణ ప్రజలు మళ్ళీ చూసేది కేసీఆర్‌, బిఆర్ఎస్ పార్టీవైపే. రాజకీయంగా ఎదురుదెబ్బలు తిని ఢీలా పడిన కేసీఆర్‌, బిఆర్ఎస్ పార్టీకి ఈ మాత్రం అవకాశం చాలు మళ్ళీ బలం పుంజుకునేందుకు!

గత ఏడాది సెప్టెంబర్‌లో సరిగ్గా వానలు పడనందున ఈసారి పంటలకు నీళ్ళు ఇవ్వలేమని కాంగ్రెస్‌ మంత్రులు చెప్పేస్తున్నారు. కనీసం వర్షాకాలంలోగా మేడిగడ్డ బ్యారేజికి యుద్ధ ప్రాతిపదికన మరమత్తులు చేయించి నీటిని నిలువ చేసుకునేందుకు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నమూ చేయడం లేదు. సాగునీటి కొరతకు కేసీఆర్‌ అవినీతే కారణమని కాంగ్రెస్‌ మంత్రులు నిరూపించి చూపాలనుకుంటున్నట్లున్నారు.

కానీ రైతులకు సాగునీరు ఇవ్వకుండా ఎన్ని మాటలు చెప్పినా వినరు. నమ్మరు. కనుక రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం సాగు త్రాగు నీరు, విద్యుత్ సరఫరా విషయంలో ఈవిదంగా రాజకీయాలు చేస్తే అందుకు ఆయనే భారీ మూల్యం చెల్లించుకోవలసి రావచ్చు.

ఇలాంటి పరిస్థితి వస్తుందని బహుశః కేసీఆర్‌ ఊహించి ఉండవచ్చు. అందుకే ఆరు నెలలు లేదా ఏడాదిలోగా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం పడిపోతుందని, మళ్ళీ తానే అధికారంలోకి వస్తామని చెప్పుకుంటున్నారేమో?

ADVERTISEMENT
Latest Stories