తెలంగాణ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి రావచ్చని దాదాపు అన్ని సర్వేలు తేల్చేశాయి. వాటి అంచనాల ప్రకారం కాంగ్రెస్ వస్తే, మొదట ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ మొదలవుతుంది.
కేసీఆర్ చేతిలో నిర్వీర్యమైన కాంగ్రెస్‌ను సీనియర్ కాంగ్రెస్ నేతలెవరూ కాపాడలేకపోయారు. పైగా పార్టీకి నష్టం జరుగుతోందని తెలిసినా తమలో తాము కీచులాడుకొంటూనే ఉన్నారు. ఈ స్థితిలో రేవంత్ రెడ్డి పార్టీ పగ్గాలు చేపట్టారు. పార్టీలో సీనియర్లు ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. వారి సహకారం లభించనప్పటికీ రేవంత్ రెడ్డి ధైర్యంగా పార్టీని తనదైన శైలిలో నడిపిస్తూ కేసీఆర్‌ని, బిఆర్ఎస్ పార్టీని ఢీకొన్నారు.
రేవంత్ రెడ్డి వ్యవహారశైలిపై పార్టీలో సీనియర్లు విమర్శిస్తుంటే, ఓటుకి నోటు కేసుని ప్రస్తావిస్తూ బిఆర్ఎస్ నేతలు విమర్శించేవారు. అయినా రేవంత్ రెడ్డి ఏమాత్రం వెనక్కు తగ్గకుండా ముందుకే సాగి పార్టీని విజయతీరానికి చేర్చారు. కనుక రేవంత్ రెడ్డికే ముఖ్యమంత్రి అయ్యే హక్కు ఉందని భావించవచ్చు. కనుక కాంగ్రెస్ అధిష్టానం ఆయననే ముఖ్యమంత్రి చేయవచ్చు.
కానీ పార్టీలో కొందరు సీనియర్లు కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తే వారు అసంతృప్తి చెందుతారు. బిఆర్ఎస్ వారికి గాలం వేసి తమవైపు తిప్పుకొనే అవకాశం ఉంటుంది. ఒకవేళ రేవంత్ రెడ్డిని కాకుండా మరొకరికి ముఖ్యమంత్రిని చేస్తే ఆయన అసంతృప్తి చెందుతారు.
ఒకవేళ కాంగ్రెస్‌కు స్వల్ప ఆధిక్యతతో ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగినా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి చేరిపోవచ్చు లేదా ముఖ్యమంత్రి పదవి ఆశించి భంగపడిన సీనియర్ నేతలు, ఇప్పుడు కాకపోతే కొన్ని నెలల తర్వాత అయినా గెలిచిన ఎమ్మెల్యేలను తీసుకొని బిఆర్ఎస్‌లో చేరిపోవచ్చు.
ఒకవేళ కాంగ్రెస్, బిఆర్ఎస్‌లకు ఇంచుమించు సమానంగా సీట్లు లభించిన్నట్లయితే, మజ్లీస్ మద్దతుతో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు. ఆ తర్వాత గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బిఆర్ఎస్‌లోకి వెళ్లిపోవచ్చు. కనుక కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలకు పూర్తి మెజార్టీతో అధికారంలోకి రావడం చాలా అవసరం.




