తెలంగాణలో కూల్చివేత రాజకీయాలు… ఫస్ట్ వికెట్ మల్లారెడ్డే!

BRS To Contest In All 175 Seats Of AP

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ ప్రభుత్వం ప్రజావేదిక కూల్చివేసి ఆ శిధిలాలపై ప్రతీకార రాజకీయాలకు పునాది వేసుకోగా, తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి తొలిరోజే ప్రగతిభవన్‌ బ్యారికేడ్లు కూల్చివేసి తనదైన శైలిలో పాలన ప్రారంభించారు. అయితే ప్రగతిభవన్‌లోకి సామాన్య ప్రజలను అనుమతించేందుకే బ్యారికేడ్లు కూల్చివేసినందున, అందరూ ఆయన చర్యని హర్షించారు.

ADVERTISEMENT

కానీ రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని కేటీఆర్‌, హరీష్ రావులు నిత్యం బెదిరిస్తుండటంతో ఆయన మడి కట్టుకొని కూర్చోలేని పరిస్థితి కల్పించారు. కనుక ఇంతకాలం తాము ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లు వ్యవహరించిన బిఆర్ఎస్ నేతలకు రేవంత్‌ రెడ్డి కూడా తన దెబ్బ రుచి ఎలా ఉంటుందో ‘శాంపిల్’ చూపించారు.

మాజీ మంత్రి మల్లారెడ్డి ఇది వరకు తొడ కొట్టి రేవంత్‌ రెడ్డిని బూతులు తిడుతూ దమ్ముంటే రమ్మనమని సవాలు చేసేవారు. ఇప్పుడు ఆ సవాలుకి జవాబుగా, దిండిగల్ చిన్నదామర చెరువులోని ఆయన అల్లుడు, బిఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీ భవనాలను గురువారం రెవెన్యూ సిబ్బంది పాక్షికంగా కూల్చివేశారు.

కారణం ప్రభుత్వ స్థలాన్ని భూకబ్జా చేసి కట్టడమే అని చెప్తున్నారు. కానీ రాజకీయ కక్ష సాధింపే అని బిఆర్ఎస్ వాదిస్తోంది. రెండూ నిజమే అని అందరికీ తెలుసు.

కారణం ఏదైనప్పటికీ, అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగకూడదని ఇది తెలియజేస్తోంది. అలాగే అధికారం చేతిలో ఉంటే ఏమైనా చేయవచ్చని కూడా ఇది నిరూపిస్తోంది.

మల్లారెడ్డి కుటుంబ సభ్యులు, బందు మిత్రులకు హైదరాబాద్‌ చుట్టుపక్కల ఇంకా చాలా కాలేజీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా ఉన్నాయి. కనుక రేవంత్‌ రెడ్డి ఇచ్చిన ఈ చిన్న ‘జలక్’తో దారికొచ్చేశారు.

ఇన్ని రోజులూ ‘మల్కాజ్‌గిరి ఎంపీ సీటు మాదే… మమ్మల్ని ఓడించే మొగాడు పుట్టలేదు’ అని ప్రగల్భాలు పలికిన నోటితోనే, ఈసారి పోటీ చేయడం లేదని చెప్పుకోవలసి వచ్చింది. కాంగ్రెస్‌లో చేరడం లేదని మల్లారెడ్డి చెప్పుకోవడమే ఓ ఓటమి. తనకి ఆ పరిస్థితి వచ్చిందని చెప్పుకున్నట్లే భావించవచ్చు. కనుక ఇప్పుడు కాకపోతే రేపో ఎల్లుండో చేరక తప్పదని ఆయన చెపుతున్నట్లే ఉంది.

ఏపీలో జగన్‌ ప్రభుత్వం కూడా ప్రతిపక్షాలతో, ప్రజలతో 58 నెలలుగా కబాడీ ఆడుకుంటూనే ఉంది. వైసీపి నేతల నోటికి అదుపు, హద్దు రెండూ లేవు. కనుకనే నారా లోకేష్‌ ‘ఎర్ర డైరీ’ మెయిన్‌టెయిన్ చేయాల్సి వస్తోంది. కనుక నేడు తెలంగాణలో జరుగుతున్నదే రేపు ఏపీలో కూడా జరుగబోతోందని స్పష్టమవుతోంది.

ఇప్పుడు సరిదిద్దుకోవడానికి సమయం కూడా లేదు. కనుక జరుగబోయే ప్రమాదాన్ని పసిగడుతున్న వైసీపి నేతలు తమ టైటానిక్‌లో నుంచి దూకేసి భవిష్యత్‌ కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా ‘నువ్వే మా నమ్మకం అనుకున్నవారు’ దేవుడిపై భారం వేసి జగన్‌ భజన చేసుకుంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories