పవన్ కళ్యాణ్ “సర్దార్ గబ్బర్ సింగ్” సినిమా విడుదలకు ముందు ట్విట్టర్ వేదికగా సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసిన హంగామా నెటిజన్లకు తెలియనిది కాదు. ప్రపంచంలోనే పవన్ అంత క్రేజీ యాక్టర్ మరొకరు లేరనే విధంగా అతిశయోక్తులతో ముంచేసారు. అయితే ఇదంతా సినిమా విడుదలకు ముందు మాత్రమే. ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సినిమా విడుదలైన తర్వాత పరిస్థితి ఏంటి? అంటే… ఎంత పొగిడారో, అంతకుమించిన వ్యంగ్యాస్త్రాలతో పవన్ ఫ్యాన్స్ కు కంటి మీద కునుకు లేకుండా చేసారు.
కట్ చేస్తే… మరో పది రోజుల్లో “అజ్ఞాతవాసి” సినిమా రిలీజ్… పబ్లిసిటీలో భాగంగా ఈ సినిమా పోస్టర్స్ నెటిజన్లను పలకరిస్తున్నాయి. మరి వర్మ ఉరకనే ఉంటారా? అప్పుడు ట్విట్టర్ అయితే, ఇప్పుడు ఇంస్టాగ్రామ్… అంతే తేడా..! “అజ్ఞాతవాసి” పోస్టర్స్ ను పోస్ట్ చేస్తూ… “నేను నా గత జన్మలో కూడా ఇలాంటి యాటిట్యూడ్ ఉన్న అతన్ని చూడలేదు… రజనీకాంత్, అమితాబ్ ఎందుకు పనికిరారు పీకే ముందు… బ్రూస్ లీకి మొగుడులా ఉన్నాడు…” అంటూ మరోసారి తనదైన పదజాలాన్ని రుచిచూపిస్తున్నారు.
“నేను గే కాదని అందరికీ తెలుసు… కానీ ప్రపంచంలో ఉన్న మొత్తం అందమైన అమ్మాయిలు అందరూ ఒక వైపున ఉన్నా, నేను ఈ పోస్టర్లో ఉన్న అబ్బాయినే చూస్ చేసుకుంటా…” అని చెప్పడమే కాకుండా మార్ఫింగ్ తో పవన్ ను ముద్దాడుతున్న ఒక ఫోటోను కూడా పోస్ట్ చేసారు వర్మ. ఈ రేంజ్ లో పొగుడుతున్నారంటే ప్రస్తుతానికి బానే ఉంటుంది. కానీ సినిమా రిలీజ్ అయ్యాక తేడా కొట్టిందో, ఎవరూ చెప్పని విధంగా గాలి తీసేయడంలో వర్మ ఆరితేరిన వారన్న సంగతి తెలియనిది కాదు.



