pawan-kalyan-in-kakinada-port

ఈరోజు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌, పౌరసరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌, అధికారులతో కలిసి కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమంగా ఆఫ్రికా దేశాలకు రవాణా అవుతున్న అంశంపై పోర్టు అధికారులను, సిబ్బందిని గట్టిగా నిలదీశారు.

పోర్టుకి ఎక్కడి నుంచి ఎవరు ఎంతెంత రేషన్ బియ్యం తీసుకువస్తున్నారో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎవరి పేరిట ఈ రేషన్ బియ్యం ఆఫ్రికా దేశాలకు ఎగుమతి అవుతోందో అడిగి తెలుసుకున్నారు.

Also Read – సీక్వెల్స్: వైఫల్యం నుండి విజయం వరకు

స్థానిక టీడీపీ ఎమ్మెల్యే వనమాది వేంకటేశ్వర రావుని కూడా పవన్ కళ్యాణ్‌ గట్టిగా నిలదీశారు. మీ నియోజకవర్గంలో ఉన్న పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుంటే ఏం చేస్తున్నారని నిలదీశారు.

పోర్టు గోదాములలో రవాణా చేయడానికి సిద్దంగా ఉంచిన రేషన్ బియ్యం నిలువలని కూడా పవన్ కళ్యాణ్‌ పరిశీలించారు.

Also Read – జగన్‌ చివరి ఆశ అదే?

కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం లోడ్ చేసుకొని కొన్ని గంటల క్రితమే ఆఫ్రికా దేశానికి బయలుదేరిన ఓడని జిల్లా కలెక్టర్, పోర్టు అధికారులు కలిసి మరో బోటులో వెళ్ళి పట్టుకొని మళ్ళీ వెనక్కు తీసుకువచ్చారు.

పవన్ కళ్యాణ్‌, నాదెండ్ల మనోహర్‌, పోర్టు అధికారులతో కలిసి ఓడలోకి వెళ్ళి బియ్యాన్ని పరిశీలించారు. ఆ తర్వాత మంత్రి నాదెండ్ల మనోహర్‌తో ఈ అక్రమ రవాణాపై ఏకాంతంగా చర్చించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు.

Also Read – మంచులో అందరూ మంచివాళ్ళే కానీ…

వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ కాకినాడ పోర్టుని తన అధీనంలో ఉంచుకొని గత 5 ఏళ్లుగా లక్షల టన్నుల రేషన్ బియ్యం ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తూ కోట్ల రూపాయలు ఆర్జించేవారని నాదెండ్ల మనోహర్ ఎన్నికల సమయంలోనే తీవ్ర ఆరోపణలు చేశారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసి, ద్వారంపూడి చంద్రశేఖర్‌తో సహా బాధ్యులందరినీ జైలుకి పంపిస్తానని హెచ్చరించారు కూడా.

చెప్పిననట్లుగానే నాదెండ్ల మనోహర్ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తరచూ కాకినాడ పోర్టుకి వెళుతూ బియ్యం అక్రమ రవాణాని అరికట్టేందుకు చాలా గట్టి ప్రయత్నాలే చేశారు. కానీ నేటికీ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా జరుగుతోందని నిర్ధారణ అయ్యింది. దీనికి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ ప్రత్యక్ష సాక్షి.

సాక్షాత్ పౌరసరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పోర్టులో తరచూ తనికీలు చేస్తున్నా కూడా, పౌరసరఫరాల శాఖ నుంచే వేల టన్నుల రేషన్ బియ్యం కాకినాడ పోర్టుకి తరలివస్తుండటం, యదేచ్చగా విదేశాలకు ఎగుమతి అవుతుండటాన్ని ప్రభుత్వ వైఫల్యంగానే భావించాల్సి ఉంటుంది.

అసలు పౌర సరఫరాశాఖలో ఎవరికి ఇన్ని వేలటన్నుల రేషన్ బియ్యం పక్కదారి పట్టించగల సామర్ధ్యం ఉంది?అనే విషయం ఇంతవరకు తెలుసుకోలేక పోయారని తాజా రవాణా స్పష్టం చేస్తోంది.

అలాగే నేటికీ కాకినాడ పోర్టుపై ద్వారంపూడి సోదరులకు పూర్తి పట్టు ఉందని, మంత్రి నాదెండ్ల పర్యటనలతో ఎటువంటి మార్పు కలుగలేదని స్పష్టమవుతోంది.




కనుక ఇకనైనా సిఎం చంద్రబాబు నాయుడు పూనుకొని ఈ బియ్యం అక్రమ రవాణాలో భాగస్వాములైన ప్రతీ ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలి. లేకుంటే ఇంకా ఇలాగే బియ్యం అక్రమ రవాణా అవుతుంటే, అప్పుడు పోయేది కూటమి ప్రభుత్వం పరువు, విశ్వాసనీయతే.