ప్రతీ నాణేనికి బొమ్మా బొరుసు ఉన్నట్లే ట్రంప్ సుంకాలకు కూడా సైడ్ ఎఫెక్ట్ చాలా ఉంటాయి. ఈ మాట అన్నది ఎవరో కాదు… అమెరికాలో ప్రముఖ ఆర్ధికవేత్త రిచార్డ్ ఉల్ఫ్. సోవియట్ కాలం నుంచి భారత్, అమెరికాల మద్య బలమైన స్నేహ సంబంధాలున్నాయని వాటిని దెబ్బ తీసుకోవడం సరికాదని రిచర్డ్ ఉల్ఫ్ అన్నారు.
భారత్ వంటి అతిపెద్ద దేశాన్ని ఢీ కొనడం అంటే ఎలుక వెళ్ళి ఏనుగుని గుద్దినట్లే అవుతుందన్నారు. ఒకవేళ సుంకాల విషయంలో ట్రంప్ వెనక్కు తగ్గకపోతే అప్పుడు భారత్ చేతులు ముడుచుకొని ఎదురు చూస్తూ కూర్చోదని తన దేశ ప్రయోజనాలు కాపాడుకునేందుకు తప్పకుండా ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటుందన్నారు.
భారత్ ఇప్పటికే ‘బ్రిక్స్’లో సభ్య దేశం. సభ్య దేశాలైన చైనా, రష్యా, దక్షిణాఫ్రికా, యునైటడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండోనేషియాలతో భారత్‌కు ఇప్పటికే బలమైన స్నేహ, వాణిజ్య సంబంధాలున్నాయి. ‘బ్రిక్స్’లోని ఈజిప్ట్, ఇరాన్, ఇతోపియా దేశాలకు భారత్ వంటి బలమైన మిత్రదేశంతో స్నేహ సంబంధాలు కోరుకుంటాయని వేరే చెప్పక్కరలేదు.
ట్రంప్ సుంకాల కారణంగా బ్రిక్స్ సభ్య దేశాలన్నీ మరింత దగ్గరవుతాయని రిచర్డ్ ఉల్ఫ్ అన్నారు. వాటి మద్య బంధం బలపడేలా చేసి, అవి అమెరికా మీద ఆధారపడకుండా పరస్పరం సహకరించుకుంటే నష్టపోయేది అమెరికాయే అన్నారు రిచర్డ్ ఉల్ఫ్. వాటిని దగ్గరయ్యేలా చేసి, బలపడి అమెరికా ఒత్తిళ్ళను తట్టుకొని నిలబడేలా చేస్తోంది తానేనని డోనాల్డ్ ట్రంప్ గ్రహిస్తే మంచిదని రిచర్డ్ ఉల్ఫ్ అన్నారు.
ఒకవేళ అమెరికా ఒత్తిళ్ళను తట్టుకొని భారత్ నిలబడగలిగితే, భారత్‌కు ఇటువంటి అగ్ని పరీక్షలు పెట్టి ఆ విదంగా తీర్చిదిద్దిన క్రెడిట్ ఖచ్చితంగా ట్రంప్‌కే దక్కుతుంది. అమెరికాతో వాణిజ్యం చేయకుండానే భారత్ స్వయంప్రతిపత్తి సాధించగలిగితే అప్పుడు యావత్ భారతీయులు డోనాల్డ్ ట్రంప్‌కి తప్పకుండా కృతజ్ఞతలు చెప్పుకోవలసిందే!




