అతి తక్కువ ధరకు ‘స్మార్ట్ ఫోన్’ను పరిచయం చేసి మొబైల్ రంగంలో సంచలనం రేపిన ‘ఫ్రీడం 251’ రిజిస్ట్రేషన్లలో కూడా సంచలనం సృష్టించింది. కేవలం రెండు రోజుల్లోనే 5 కోట్ల రిజిస్ట్రేషన్లు అయ్యాయని ‘రింగింగ్ బెల్స్’ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. వాస్తవానికి ముందుగా 25 లక్షల ఫోన్లను మాత్రమే అందించాలని కంపెనీ నిర్ణయించిందని, ఈ నేపథ్యంలో ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఇంకా కొనసాగించాలా? వద్దా? అనే విషయాన్ని పునరాలోచిస్తున్నామని రింగింగ్ బెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రెసిడెంట్ అశోక్ చద్దా పేర్కొన్నారు.
ఫోన్ ఆవిష్కరణ రోజున తాము చూపించింది కేవలం శాంపిల్ ఫోన్ మాత్రమేనని, డెలివరీ అయ్యే ఫోన్ అవే రకమైన ఫీచర్లతో ఉంటుందని, ఈ ఫోన్ల తయారీ కోసం 250 కోట్లతో రెండు తయారీ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. ఏప్రిల్ 10 నుంచి తొలి విడత డెలివరీలను మొదలు పెడతామని, జూన్ 30 లోగా సాధ్యమైనన్ని ఎక్కువ ఫోన్లు అందించేందుకు కృషి చేస్తామని, ‘తొలుత వచ్చిన వారికి తొలుత’ ప్రాతిపదికన డెలివరీలు ఇస్తామని వివరించారు.





