రాష్ట్రంలో టిడిపి కార్యకర్తలు లేదా సానుభూతిపరులు హత్యచేయబడినప్పుడు టిడిపి నేతలు నిలదీస్తుండటం, అప్పుడు టిడిపి శవరాజకీయాలు చేస్తోందని వైసీపీ నేతలు ఎదురుదాడి చేస్తుండటం చూస్తూనే ఉన్నాము. అయితే ఇప్పుడు వైసీపీ కార్యకర్తని వైసీపీ నాయకుడే హత్య చేయించేందుకు కుట్ర పన్నారని వైసీపీ నాయకుడే ఆరోపిస్తుండటం విశేషం.
నెల్లూరు అర్బన్‌లో వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌కు ఆయన సొంత బాబాయ్ డెప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్‌కు మద్య చాలాకాలంగా విభేధాలున్నాయి. ఇద్దరూ వేర్వేరుగా పార్టీ కార్యాలయాలు పెట్టుకొన్నారు కూడా. అంతవరకైతే పర్వాలేదు కానీ అనిల్ కుమార్ యాదవ్ తన అనుకఃరుడు అబ్దుల్ హాజీని హత్య చేయించేందుకు ప్రయత్నించాడని రూప్ కుమార్ యాదవ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ చెప్పారు.
“మొదటి నుంచి వైసీపీలోనే ఉన్న అబ్దుల్ హాజీ వంటి నమ్మకమైన పార్టీ కార్యకర్త. ఆయన నా వెంట ఉన్నాడనే పగతో అనిల్ కుమార్ యాదవ్ హత్యాయత్నం చేయడం చాలా దారుణం. అబ్దుల్ హాజీ అదృష్టం బాగుంది గాబట్టి తృటిలో గాయాలతో తప్పించుకొన్నారు లేకుంటే వైసీపీ ఒక నమ్మకమైన కార్యకర్తని కోల్పోయి ఉండేది.
ఒక్క అబ్దుల్ హాజీ మీదనే కాదు… నగరంలో నాతో ఉన్న కార్పొరేటర్ల ఇళ్ళు, కార్యాలయాలపై కూడా అనిల్ అనుచరులు తరచూ దాడులు చేస్తూనే ఉన్నారు. మేమందరం అనిల్ కుమార్ యాదవ్‌కు బాసటగా నిలబడి ఎమ్మెల్యేగా ఎన్నికలలో గెలిపించి, మంత్రి అయ్యేందుకు కూడా ఎంతో సహకరిస్తే ఇప్పుడు మాపైనే దాడులు చేయిస్తున్నాడు. మేము ఎదురుదాడి చేయలేక కాదు… మాకు చేతకాకా కాదు. మావలన పార్టీకి నష్టం, అప్రదిష్ట కలగకూడదనే ఇంతకాలం చాలా ఓపికతో భరించాము. కానీ అబ్దుల్ హాజీ వంటి నమ్మకమైన కార్యకర్తనే హత్య చేయించాలని ప్రయత్నించినప్పుడు ఇంకా చూస్తూ ఊరుకోలేము. అనిల్ కుమార్… నీ గురించి జగనన్నకు ఫిర్యాదు చేస్తాము. అయినా నువ్వు ఇలాంటివాడివని తెలియక ఇంతకాలం నెత్తిన పెట్టుకొని మోసినందుకు ఇప్పుడు అందరం బాధపడుతున్నాము,” అంటూ ఘాటుగా విమర్శించారు.



