శేఖర్ కమ్ముల బ్రాండ్ తో విడుదలైన “ఫిదా” సినిమా ద్వారా బాగా లాభించింది డబ్బుల పరంగా దిల్ రాజుకైతే, కీర్తి పరంగా హీరోయిన్ సాయి పల్లవి అనే చెప్పాలి. ఈ సినిమాతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ టాలీవుడ్ గా మారిన ఈ బ్యూటీ నటించిన పలు సినిమాలు ఇక వరుసపెట్టి తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నాయి. అయితే ఇవేమీ ఇప్పటికిప్పుడు టాలీవుడ్ లో నిర్మాణం అయిన సినిమాలు కావు. సాయిపల్లవి నటించిన స్ట్రెయిట్ తెలుగు సినిమా విడుదల కావాలంటే (నాని ఎంసీఏ) డిసెంబర్ 21వ తేదీ వరకు వేచిచూడాల్సిందే.
ఈ లోపున సాయి పల్లవికున్న క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి, ఈ బ్యూటీ నటించిన పలు పాత చిత్రాలను డబ్బింగ్ రూపంలో టాలీవుడ్ ప్రేక్షకుల పైకి దండెత్తబోతున్నాయి. సక్సెస్ ఉన్న వారి వెంటే పరుగులు తీసే ఇండస్ట్రీ జనానికి ఇప్పుడు సాయిపల్లవి అనే పేరు ఒక వరంలా మారింది. దీంతో ఆమె నటించిన తమిళ, మలయాళ చిత్రాలు ఏమున్నాయా? అంటూ వెలికితీసే పనిలో ఉన్నారు డబ్బింగ్ బొమ్మలను అందించే పలువురు నిర్మాతలు. ఇందులో భాగంగా “హేయ్ పిల్లగాడ” అనే సినిమా సిల్వర్ స్క్రీన్ పైకి రానుంది.
మలయాళంలో “కాలి” పేరుతో తెరకెక్కిన ఈ సినిమాను సెప్టెంబర్ లో తెలుగులో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ‘ఓకే బంగారం’ ఫేం దుల్కుర్ హీరోగా నటించిన ఈ సినిమాను కేవలం సాయిపల్లవికున్న క్రేజ్ ను క్యాష్ చేసుకోవడం కోసమే తెలుగులోకి తీసుకువస్తున్నారు. అయితే తెలుగు ప్రేక్షకులకు కాస్త ఊరట కలిగించే విషయం ఏమిటంటే… ఆమె నటించిన సినిమాలు పరిమిత సంఖ్యలో ఉండడం. గతంలో నిత్యామీనన్ కు క్రేజ్ వచ్చిన సమయంలోనూ ఇలాగే ఆమె గత చిత్రాలను వెలికితీసి ప్రేక్షకుల పైకి వదలగా, కనీసం ఒక్క సినిమా కూడా విజయం సాధించలేదు. సాయిపల్లవి అంటే కూడా అలాగే విరక్తి కలిగిస్తారేమో చూడాలి.


