పాపాల భైరవుడు సజ్జల.. అమరావతికి జై ఎందుకంటే …

Sajjala Ramakrishna Reddy speaking on Amaravati capital issue

గతంలో సజ్జల రామకృష్ణా రెడ్డి చక్రం తిప్పుతూ ఓ వెలుగు వెలిగినప్పుడు, మళ్ళీ ఇప్పుడు వైసీపీలో కీలకంగా వ్యవహరిస్తున్నప్పుడు అందరూ ‘గ్రేట్’ అనుకుంటారు. పార్టీలో చాలా మంది అసూయ పడుతుంటారు కూడా. కానీ వాళ్ళకేమి తెలుసు… జగన్‌ కోసం ఆయన పాపాల భైరవుడులా నిందలు భరిస్తున్నారని?

వాళ్ళకేమి తెలుసు…జగన్‌ కోసం తప్పుడు పనులు చేయించి, తప్పుడు మాటలు మాట్లాడుతూ ప్రత్యర్ధుల, ప్రజల నిందలు, విమర్శలు భరిస్తున్నారని? వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని వెనకేసుకు వస్తూ చాలా గట్టిగా వాదించింది ఎవరు… సజ్జలేగా? నాడు మూడు రాజధానులు, విశాఖ రాజధాని స్టోరీలు ప్రజలకు వినిపించింది ఎవరు.. సజ్జలేగా?

ADVERTISEMENT

పోసాని కృష్ణ మురళిని చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌లకి వ్యతిరేకంగా వాగమని చెప్పింది ఎవరు…సజ్జలేగా? ఇలా… ఒకటా రెండా… ఐదేళ్ళపాటు సకల పాపాలు చేయిస్తూ, జగన్‌కి ఇబ్బంది కలుగకుండా వాటన్నిటినీ తన నెత్తిన వేసుకొని విమర్శలు భరించిన మహా త్యాగమూర్తి సజ్జల! కానీ ఆయన వల్లనే ఎన్నికలలో ఓడిపోయామని జగన్‌ కూడా అపోహ పడి సజ్జలని ఎత్తి పక్కన పడేశారు.

కానీ వైసీపీని ముంచడం తన ఒక్కడి వల్లే సాధ్యం కాదని జగన్‌ చాలా త్వరగానే గ్రహించారు. కనుక మళ్ళీ తెచ్చి నంబర్: 2 కుర్చీలో కూర్చోబెట్టారు. కనుక సజ్జల మళ్ళీ పాపాల భైరవుడి అవతారం ఎత్తక తప్పలేదు. జగన్‌ కోసం మళ్ళీ పాపభీతి లేకుండా మాట్లాడక తప్పడం లేదు. అందుకే జై అమరావతి అని రాళ్ళూ, చెప్పు దెబ్బలు తింటున్నారు.

ఎందుకు… ఎవరి కోసం… జగన్‌ కోసమేగా? అమరావతి మునిగిపోతోందంటూ వైసీపీ పెడుతున్న ఫేక్ వీడియోలు కూడా బెడిసి కొడుతుండటంతో, మాట తప్పని, మడమ తిప్పని జగన్‌ రూటు మార్చి అమరావతికి జై కొట్టడానికి సిద్దం పడినట్లున్నారు. కానీ నేరుగా ఆ మాట తాను మాట్లాడితే ప్రజలు చెప్పుతో కొడతారు.

కనుక పాపం సజ్జల ఆ చెప్పు దెబ్బలు తినే బాధ్యత స్వీకరించారు. అందుకే మూడు రాజధానులని ప్రజలే అపార్ధం చేసుకున్నారని, జగన్‌ విశాఖ రాజధాని అనుకున్నారు గానీ కుదరలేదని, కనుక జగన్‌ మళ్ళీ అధికారంలోకి వస్తే అమరావతిలోనే కంటిన్యూ అయిపోతారని చెప్పి జగన్‌కు తగలాల్సిన రాళ్ళు, చెప్పు దెబ్బలు సజ్జల తీసుకుంటున్నారు.

ఈసారి జగన్‌ వస్తే ముందుగా రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేస్తారని సజ్జల గ్యారెంటీ ఇచ్చారు. అమరావతిలో సచివాలయం, శాసనసభ, హైకోర్టు వగైరా ఉన్నాయి కనుక ఈసారి జగన్‌ అమరావతి నుంచే పాలన సాగిస్తారని చెప్పారు. రాజధాని విషయంలో జగన్‌కున్న నిబద్దత చంద్రబాబు నాయుడుకి లేదని సజ్జల స్పష్టం చేశారు.

అమరావతి విషయంలో తన మాటలు, ఆలోచనలు తప్పని జగన్‌ అంగీకరించకపోయినా, తన వ్యూహం బెడిసికొట్టిందని జగన్‌ అంగీకరించారని సజ్జల మాటలతో స్పష్టమయింది. సజ్జల ఇదే విషయం మరో పదిసార్లు చెబుతూ ప్రజాగ్రహాన్ని తనపైకి మళ్ళించుకుంటున్నారు.

ఆ తర్వాత జగన్‌ వచ్చి ‘అమరావతే మన రాజధాని… ఇది తధ్యం తధ్యం’ అంటూ పాట మొదలుపెడతారు. అప్పుడు వైసీపీ నేతలందరూ ఆయనకు కోరస్ పాడుతారన్న మాట! కనుక ఇది అమరావతి విషయంలో వైసీపీ భవిష్య కార్యాచరణ అనుకోవచ్చు. జగన్‌ మళ్ళీ అమరావతి అంటున్నారు కనుక గెలిపించేసుకుందామా జనాలూ?

ADVERTISEMENT
Latest Stories