సజ్జల రామకృష్ణా రెడ్డి వైసీపికి ప్రధాన కార్యదర్శి, జగన్ ప్రభుత్వానికి సలహాదారు. కానీ ఆయన ఆ పార్టీకి సాయపడుతున్నారో లేక శల్యసారధ్యం చేస్తూ ఎన్నికలలో దెబ్బ తీయబోతున్నారో అనే సందేహాలు ఎప్పుడూ వ్యక్తం అవుతూనే ఉన్నాయి.
ఎందుకంటే, ఆయన మీడియా ముందుకు వచ్చి ఎప్పుడు మాట్లాడినా తమ పార్టీని, ప్రభుత్వాన్ని, దాని అధినేతని గట్టిగా వెనకేసుకువస్తూ మాట్లాడుతుంటారు. కానీ ఆయన మాటలు, చేతల వలన వైసీపికి చెడ్డ పేరు వస్తోంది. తాజాగా ఆయన మీడియాతో అన్న మాటలు ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
ఆయన ఏమన్నారంటే, “మాకు ఎన్డీయేలో చేరమనే ఆఫర్ ఎప్పటి నుంచో ఉంది. కానీ పొత్తుల వలన తర్వాత ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశ్యంతో మేము ఎన్డీయేలో చేరలేదు. అయినప్పటికీ జగన్ కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల మద్య బలమైన సంబంధాలు కొనసాగించారు,” అని అన్నారు.
మోడీ-జగన్ మద్య మంచి ‘అండర్ స్టాండింగ్’ ఉందని అందరికీ తెలుసు. ఇప్పుడు టిడిపితో బీజేపీ పొత్తులు పెట్టుకొన్నప్పటికీ నేటికీ వారి మద్య ఆ ‘అండర్ స్టాండింగ్’ అలాగే ఉందని చెప్పడానికి నరసాపురం సీటు వంటి అనేక నిదర్శనాలు కనబడుతూనే ఉన్నాయి. సజ్జల కూడా మా మద్య అండర్ స్టాండింగ్ ఉందనే చెప్పారు. ఎన్నికలకు ముందు ఈవిదంగా మాట్లాడితే దాని వలన నష్టపోయేది వైసీపియే కదా?
గత ఎన్నికలలో తమ పార్టీకి గెలుపుకి తోడ్పడిన తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్ గురించి కూడా సజ్జల నోరు జారారు. “కేసీఆర్ చేసిన తప్పు జగన్ చేయలేదు. కేసీఆర్ సంక్షేమ పధకాలకు భారీగా నిధులు కేటాయించేవారు కానీ వాటిని విడుదల విషయంలో శ్రద్ధ చూపేవారు కారు. కానీ జగన్ సంక్షేమ పధకాలకు నిధులు కేటాయించడమే కాకుండా అవి లబ్ధిదారులకు చేరే వరకు పూర్తి శ్రద్ద వహించారు. కేసీఆర్ చేసిన తప్పునీ జగన్ చేయలేదు కనుక ఏపీలో 50 శాతం ప్రజలు వైసీపికే ఓట్లు వేసి గెలిపించబోతున్నారు,” అని అన్నారు.
కేసీఆర్ హయాంలో దళిత బంధు వంటి కొన్ని పధకాలలో మాత్రమే కొన్ని లోపాలు, పొరపాట్లు జరిగిన మాట వాస్తవం. కానీ చాలా మెరుగైన పధకాలు అనేకం అమలు చేశారు. వాటిని జగన్ ప్రభుత్వం కూడా కాపీ కొట్టి అమలుచేస్తోంది కూడా.
కానీ కేసీఆర్ పధకాలను కాపీ కొట్టిన జగన్, అభివృద్ధిని కూడా కాపీ కొట్టి ఉండి ఉంటే నేడు ఏపీ కూడా తెలంగాణ రాష్ట్రంలాగా దేశంలో నంబర్ 1 స్థానం నిలిచి ఆర్ధికంగా బలంగా ఉండేది. కానీ వైసీపికి ఓటు బ్యాంకుని నిర్మించుకునేందుకు జగన్ అభివృద్ధిని పణంగా పెట్టి సంక్షేమ పధకాలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చారు. తత్ఫలితంగా నేడు ఆంధ్రప్రదేశ్ ఎటువంటి దయనీయస్థితిలో ఉందో అందరికీ తెలుసు.
కేసీఆర్ ఓటమికి సంక్షేమ పధకాలు వైఫల్యం కాదని అందరికీ తెలుసు. కానీ ఏపీలో జగన్ గెలిస్తే సంక్షేమ పధకాలు కారణం కావచ్చేమో కానీ ఓటమికి వెయ్యి కారణాలు కనిపిస్తున్నాయి.
కనుక జగన్ చేసిన తప్పుని కేసీఆర్ చేయలేదని, అయినా ఆయన ఓడిపోయారని సజ్జల చెప్పుకుంటే బాగుండేది. కానీ సజ్జల తిరగేసి చెపుతున్నారు.




