సజ్జలా..ఓ సజ్జలా..’లైబ్రరీ’లో ఉన్నారా..?

sajjala-rama-krishna-reddy_ysrcp

వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన ఈ సాక్షి పత్రిక జర్నలిస్ట్ గారు గత ఐదేళ్లు గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనధికారిక ముఖ్యమంత్రిగా రాజకీయాలను చక్కబెట్టారు. జగన్ పాలనకు సజ్జల షాడోగా ప్రవర్తిస్తున్నారా లేక సజ్జల షాడోలో జగన్ పాలన చేస్తున్నారా అన్నంతలా ఏపీ రాజకీయాలను సజ్జల శాసించారు.

సజ్జల ప్రత్యక్ష రాజకీయాలలో జగన్ కు, వైసీపీ ప్రభుత్వానికి సలహాదారుడిగా కొనసుగుతుంటే ఆయన పుత్ర రత్నం సజ్జల భార్గవ్ రెడ్డి వైసీపీ సోషల్ మీడియాకు నియంతలా వ్యవహరించాడు. సజ్జల భార్గవ్ రెడ్డి రాజకీయ ఎంట్రీ తో ఏపీ రాజకీయ ముఖ చిత్రం ఏ స్థాయికి దిగజారిందో అనేది ఆయన ప్రత్యర్థి పార్టీ నేతల మీద సోషల్ మీడియాలో పెట్టే పోస్టులే ప్రత్యక్ష ఉదాహరణలుగా నిలిచాయి.

ADVERTISEMENT

రాజకీయాలకు సంబంధం లేని మహిళలను, వారి కుటుంబాల జీవితాలను సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ మీద పరిచారు. అలాగే ప్రత్యర్థి పార్టీలో మహిళ నేతలను కించపరుస్తూ వారి కుటుంబాలను మానసికంగా కృంగతీసారు. వైసీపీ కేంద్రంగా కొడుకు రాజకీయాలు ఇలా ఉంటే ఇక పెద్దాయన సజ్జల గారి రాజకీయాలు తడి గుడ్డతో గొంతులు కోసినట్టే ఉండేవి.

అప్పటి ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన ఏ శాఖ మీదనైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అందుకు ప్రభుత్వం నుండి సమాధానం చెప్పడానికి కాదు కౌంటర్ వేయడానికి మీడియా ముందుకు వచ్చే ఏకైక వ్యక్తి సజ్జల రామకృష్ణ రెడ్డి. దీనితో ఈయన గారి టాలెంట్ కు గుర్తింపుగా సజ్జల కు ‘సకల శాఖ’ మంత్రిగా బిరుదునిచ్చి సత్కరించారు టీడీపీ, జనసేన నేతలు.

ఒక్క పాలనా పరమైన విషయాలలోనే కాదు జగన్ వ్యక్తిగత విషయాల మీద, వైస్ కుటుంబ వివాదాలు మీద కూడా సజ్జల గారే వివరణ ఇచ్చేవారు. వివేకా కేసులో ఆయన కుమార్తె సునీత వైసీపీ ప్రభుత్వం మీద అనుమానాలు వ్యక్తం చేసినా, ముఖ్యమంత్రిగా ఉన్న తన అన్న జగన్ మీద ఆరోపణలు చేసినా దానికి సజ్జలే సర్ది చెప్పేవారు.

ఇక షర్మిల పొలిటికల్ ఎంట్రీ నుండి జగన్ మీద ప్రకటించిన యుద్ధం వరకు అన్నిటికి మీడియా ముందు బదులిచ్చింది ఈ సలహాదారుడే. జగన్ ను కాపాడడానికి సజ్జల పడుతున్న ఆరాటాన్ని గమనించిన వైస్ షర్మిల ఆయనను మరో రకంగా సత్కరించారు. YSR కాంగ్రెస్ పార్టీ పేరులో ఉన్నది తన తండ్రి ‘YSR’ కాదని ‘Y’ అంటే ‘వైవీ సుబ్బా రెడ్డి’ అన్ని, ‘S’ అంటే ‘సాయి రెడ్డి’ అని, ‘R’ అంటే ‘సజ్జల రామకృష్ణ రెడ్డి’ అంటూ YSR పేరులో ఉన్న గుడార్దాన్ని వివరించారు షర్మిల.

వైసీపీ ప్రభుత్వంలోనే కాదు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ పుట్టుకలోనే సజ్జల గారి పాత్ర కీలకమని షర్మిల చెప్పకనే చెప్పారు. అయితే వైసీపీ ప్రభుత్వాన్ని డిఫెండ్ చేయడానికి, ప్రత్యర్థి పార్టీల నాయకుల మీద విమర్శలు చేయడానికి ఈయన వాడే ఏకైక అస్త్రం “ఇదంతా బాబు స్క్రిప్టులో భాగమే” అంటూ నెపం మొత్తం చంద్రబాబు పై నెట్టి జగన్ చిన్నపిల్లాడు, అమాయకుడు, మంచివాడు అంటూ ప్రజలను నమ్మించడానికి నానా ప్రయత్నాలు చేసారు సజ్జల.

గత ఐదేళ్లుగా సకల శాఖ మంత్రిగా సజ్జల పడ్డ కష్టం, షాడో ముఖ్యమంత్రిగా ఆయన చేసిన కృషి, వైసీపీ ప్రభుత్వానికి సజ్జల ఇచ్చిన సలహాలు అన్ని కలగలిపి 2024 ఎన్నికలలో వైసీపీకి ’11 తో పంగనామాలు’ పెట్టె స్థాయికి చేర్చాయి. దీనితో ఇన్నాళ్లు టీడీపీ మీద బురద జల్లుతూ, బాబు మీద విషం జిమ్ముతూ నిత్యం ఎదో ఒక టాపిక్ తో మీడియాలో దర్శనమిచ్చే సలహాదారు ఇప్పుడు కనుమరుగయ్యారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు మూడు నెలలు పూర్తవుతున్నా మీడియాలో కానీ, రాజకీయ వేదికల మీద కానీ సజ్జల గారి జాడ కనిపించడం లేదు. కనీసం వైసీపీ పార్టీ కార్యాలయం లో కానీ జగన్ తాడేపల్లి పాలస్ లో కానీ సజ్జల ఆనవాళ్లు లేవు. దీనితో ‘వేర్ ఈజ్ సజ్జల’ అనే ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సజ్జలా … ఓ సజ్జలా మీరు రాజకీయాలు వదిలి లైబ్రరీలో ఉన్నారా అందుకే ఇంత నిశ్శబ్దాన్ని పాటిస్తున్నారా అంటూ సజ్జల మీద సెటైర్లు కూడా పేలుతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories