ఒక అవినీతి సంపాదన నుండి పుట్టిన మీడియాకు ఎలాంటి ‘విలువలు’ ఉంటాయో, వాటి ‘విశ్వసనీయత’ ఏమిటో అని చెప్పడానికి ‘సాక్షి’ మీడియా ఒక నిదర్శనంగా నిలుస్తుంది. విలువలకు తిలోధకాలు ఇస్తూ, తమ పబ్బం ఎలా గడుపుకోవాలో జగన్ సొంత మీడియా అయిన సాక్షికి తెలిసినట్లుగా మరొక మీడియాకు తెలియదని చెప్పడంలో సందేహం లేదు.
గత పది పదిహేనేళ్లుగా తమకు అలవాటైపోయిన అబద్ధాలను ప్రసారం చేసి చేసి విసుగు కూడా రావట్లేదేమో గానీ, సూర్యుడు తూర్పున ఉదయించే నిజాన్ని, లేదు లేదు పడమరనే ఉదయిస్తాడని, తమ మీడియా చూసే వారిని నమ్మించే విధంగా, ఒక అబద్ధాన్ని నిజం చేయడం కోసం వంద కాదు, వెయ్యి సార్లైనా ప్రచురిస్తుంది, ప్రసారం చేస్తుంది సాక్షి.
Also Read – పుష్పని కూడా వైసీపీ విడిచిపెట్టదా?
ఇలాంటి ‘ఆత్మసాక్షి’ లేని కధనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే సాక్షి మీడియా, తాజాగా చంద్రబాబు క్యాబినెట్ లో చేరిన కూర్పులపై కూడా అవాస్తవ కధనాలను ప్రసారం చేసింది. చంద్రబాబు ఇచ్చినటువంటి 24 మంత్రి పదవులలో కులాల చిచ్చును రేపేందుకు తమ విశ్వప్రయత్నాలను చేస్తోంది సాక్షి మీడియా.
24 మందిలో 15 మంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారేనని, సామాజిక న్యాయం చేయడంలో జగన్ ను మించిన మహానుభావుడు ఈ భూప్రపంచంలోనే లేరనట్లుగా కధనాలు ప్రసారం చేసింది. అయితే అసలు వాస్తవం ఏమిటో అందరికి తెలిసిందే. 24 మందిలో కేవలం నలుగురు మాత్రమే కమ్మ సామాజిక వర్గానికి చెందిన మంత్రులు ఉన్నారు.
Also Read – ఈ మర్యాద, గౌరవం నాకొద్దు బాబోయ్!
ఇంతకు మించిన అసలు వాస్తవం ఏమిటంటే, 2019లో జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్ సామాజిక వర్గానికి చెందిన రెడ్లకే అత్యధిక ప్రాధాన్యతనిస్తూ, తన క్యాబినెట్ తో సహా సహాయక, సలహాదారుల పదవులను సృష్టించి, ప్రధాన విభాగాల్లో పనిచేసే ప్రభుత్వ అధికారులను సైతం రెడ్డి వర్గానికి చెందిన వారిని నియమించిన వైనం రాజకీయ విజ్ఞులకు తెలిసిందే.
నాటి అధికార ప్రభుత్వంలోనే కాదు, నేటి ప్రతిపక్ష హోదా లేని స్థాయిలో కూడా జగన్ తన సొంత సామాజిక వర్గానికి చెందిన వారికే పట్టం కడుతూ, వైసీపీ పార్లమెంటరీ నేతగా వైవీ సుబ్బా’రెడ్డి’ని, రాజ్యసభ పార్టీ నాయకుడిగా విజయసాయి’రెడ్డి’ని, లోక్ సభలో మిథున్’రెడ్డి’ని నియమించి తన సామాజిక న్యాయం యొక్క చిత్తశుద్ధిని ఎలుగెత్తి చాటారు.
Also Read – వైసీపీ మళ్ళీ ‘మెగా’ బకరా అయ్యిందా.?
ఇలాంటి విపరీతమైన చేష్టలు చేసారు, చేస్తున్నారు కాబట్టే, ఇవన్నీ గమనించిన ప్రజలు 11 సీట్లు ఇచ్చి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఓ మూలన కూర్చోపెట్టారు. ఇంతలా జనాలు ‘జగన్ అండ్ కో’కు క్షవరం చేసి ఇంటికి పంపించినా, వారికి ఏ మాత్రం ‘వివరం’ రాలేదనడానికి ఉదాహరణే ఈ సాక్షి మీడియా కధనాలుగా పేర్కొనవచ్చు.
ప్రజలు ఈ స్థాయిలో ఎందుకు తిరస్కరించారో కూడా తెలుసుకోలేని నీచ స్థితిలో జగన్ మరియు అతని అనియాయులు ఉండడం కొసమెరుపు. నిజానికి ఇలాంటి వ్యక్తులు ఇంకా భవిష్యత్తులో ఏపీ ప్రజలకు అవసరం లేదనే చెప్పాలి. అలాగే వీరి తరపున ప్రజాగళంగా వినిపించే ఈ ‘సాక్షి’ మీడియాను నియంత్రించాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఖచ్చితంగా ఉంది.
2014 నుండి 2019 వరకు కూడా ఇలాంటి అసత్యపు కధనాలనే ప్రసారం చేయగా, నాటి చంద్రబాబు సర్కార్ వాటిని తేలికగా తీసుకోవడం 2019 ఫలితాలను ఏ రకంగా నిర్ధేశించింది. ఇప్పుడు కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుంటే, పరోక్షంగా సాక్షిని ప్రోత్సహించినట్లే అవుతుంది.
అసత్యాలు చెప్పడానికి అలవాటైన నాలుక ఎప్పుడూ అదే చెప్తుంది. జగన్ మరియు అతని సొంత మీడియా ఇంతకు మించి మారతారని భావిస్తే, అది ఖచ్చితంగా చంద్రబాబు తప్పే అవుతుంది. సాక్షి మీడియాలో చికెన్, కోడి గ్రుడ్డు ధరలు మరియు తేదీ తప్ప ఏవీ నిజముండవని ఇటీవల టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ అయ్యాయో తెలిసిందే.
అలాగే సాక్షిలో ఒక్క అబద్ధం కూడా ఉండదని, ఒకటి రెండు సార్లు చెక్ చేసుకుని వేస్తారని జగన్ సతీమణి భారతి చేసిన వ్యాఖ్యలు కూడా ఎంతలా ప్రభావితం చూపాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏతావాతా చెప్పొచ్చేది ఏమిటంటే… రాష్ట్ర అభివృద్ధితో పాటు, అరాచకపు నీచ రాజకీయాలు చేసి అలవాటైపోయిన ‘జగన్ అండ్ కో’ని నియంత్రించాలని ప్రజలు ఈ స్థాయిలో కూటమికి పట్టం కట్టారు.