ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి చెందిన సాక్షి పత్రిక చాలా సార్లు కనీసం ఆ జర్నలిజం ముసుగు కూడా వేసుకోకుండా పూర్తిగా వైఎస్సార్ కాంగ్రెస్ కరపత్రికగా మారిపోతుంది అంటూ ప్రత్యర్ధులు ఆరోపిస్తూ ఉంటారు. ఆ పత్రిక కూడా ఆ వాదనను పూర్తిగా కాదు అనలేని విధంగానే ప్రవర్తిస్తూ ఉంటుంది.
తాజాగా తిరుపతి ఉపఎన్నిక నేపథ్యంలో అటువంటి కథనం ఒకటి ప్రచురించింది. మునిసిపల్ ఎన్నికల్లో మన పరువు పోయింది… తిరుపతిలో కనీసం రెండో స్థానమైన దక్కించుకుని పరువు కాపాడాలని చంద్రబాబు నేతలకు చెప్పారట. అంతవరకు బానే ఉంది. జనసేన మన మిత్రపక్షమే… ఆ పార్టీని ఎట్టిపరిస్థితులలోనూ విమర్శించొద్దు అని చంద్రబాబు చెప్పారట.
ఈ విషయం ఎవరికీ తెలియనివ్వకండి అని కూడా చెప్పారట. దీనిపై టీడీపీ, జనసైనికులు కూడా విరుచుకుపడుతున్నారు. సాక్షి ఏమన్నా చంద్రబాబు సీటు కింద కెమెరా పెట్టిందా? అంటూ ఎద్దేవా చేస్తున్నారు. తిరుపతి ఉపఎన్నిక సందర్భంగా ప్రతిపక్షాలను బలహీన పరచడం… బీజేపీ జనసేన పొత్తుని విచ్ఛిన్నం చెయ్యడమే లక్ష్యంగా ఇటువంటి దుష్ప్రచారానికి సాక్షి దిగిందని వారు ఆరోపిస్తున్నారు.
ఇంకో కథనంలో జనసేన – బీజేపీ పొత్తు బ్రేక్ అప్ దిశగా నడుస్తుందని ఇంకో కథనం ఇచ్చింది సాక్షి. జనసేన వైఖరి చూస్తుంటే బీజేపీ తప్పులు ఎత్తి చూపించి బయటపడి.. ఆంతరంగిక మిత్ర పార్టీ టీడీపీకి మద్దతుగా నిలవాలనే లోపాయికారి ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోందంటూ ఆ కథనం వండి వార్చింది.





