ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాంబు పేల్చారు. అయితే ఈ సారి సొంత పార్టీ మీద. నెల్లూరులో వైఎస్సార్ కాంగ్రెస్ బహిరంగసభలో ఆయన రాష్ట్రవ్యాప్తంగా అధిక సంఖ్యలో ఫారం 7 అప్లికేషన్స్ (ఓట్లు తీసి వెయ్యడానికి ఇచ్చే అప్లికేషన్స్) ఇచ్చింది తమ పార్టీనే అని, దొంగ ఓట్లు తీసి వెయ్యడానికే అలా చేశామని, ఇందులో తప్పేంటి అంటూ వాదించారు. జగన్ చేసిన ఈ వ్యాఖ్య సెల్ఫ్ గోల్ గా పరిణమించింది. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న వివాదం ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ మెడకు చుట్టుకుంది.
ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఇది క్రిమినల్ ఆఫెన్సు అని తేల్చి చెప్పి కేసులు నమోదు చేస్తుంది. ఈ క్రమంలో ఇది తామే చేశాం అని జగనే స్వయంగా ఒప్పుకోవడమంటే అది ఆత్మహత్య సదృశ్యమే. ఈ విషయంలో జగన్ నోరు జారినట్టుగా ఉన్నారు. దానికి నిదర్శనమే ఈ రోజు సాక్షి పేపర్. ఈ సభ గురించి వేసిన వార్తలో ఎక్కడా జగన్ చేసిన వ్యాఖ్య గురించి ప్రస్తావించలేదు. అయితే ఈ వ్యాఖ్య తెలుగుదేశం పార్టీకి ఆయుధంగా దొరికింది. ఆ పార్టీ ఎన్నికల కమిషన్ దృష్టికి తెచ్చేందుకు సిద్ధం అవుతుంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల తొలగింపు కుట్రలో ఏ1 నిందితుడు వైకాపా అధ్యక్షుడు జగనేనని.. ఫారం-7 దుర్వినియోగం ఆ పార్టీకి సిగ్గుచేటని తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో ఓట్లు గల్లంతైన వారంతా జగన్‌ను నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. ఫారం 7 దరఖాస్తులు 13 లక్షలు పంపుతారా అని వైకాపాను ఉద్దేశించి ఆయన ప్రశ్నించారు. బెంగళూరు,హైదరాబాద్ నుంచే ఈ కుట్రలు సాగాయని ఆరోపించారు. ఓటు జాబితాలో ఉందో లేదో సరిచూసుకోవాలని ప్రజలకు సీఎం పిలుపునిచ్చారు.



