ఇంకో ఇరవై రోజుల్లో శాకుంతలం విడుదలవుతోంది. సమంతా అంతా తానై ప్రమోషన్లు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఎందుకంటే ఈ సినిమాకు బ్రాండ్ తనే. హీరో దేవ్ మోహన్ మలయాళం బ్యాచ్. మనకసలు పరిచయమే లేదు. మోహన్ బాబు, గౌతమి, సుబ్బరాజు లాంటి సీనియర్లు చాలానే ఉన్నారు కానీ వీళ్లంతా ఓపెనింగ్స్ ని ఫుల్ చేసే కెపాసిటీ ఉన్న వాళ్ళు కాదు. అల్లు అర్జున్ కూతురు అర్హ చైల్డ్ డెబ్యూ కాబట్టి కౌంట్ లోకి తీసుకోలేం. మొదటి రోజు థియేటర్లలో తెగే పది టికెట్లలో ఆరు సామ్ పేరువే ఉంటాయి. మిగిలిన నాలుగు దర్శకుడు గుణశేఖర్ వి లేదా విజువల్ ఎఫెక్ట్స్ మీద చేసిన పబ్లిసిటీ వల్ల వచ్చేవి. ఇక్కడే పెద్ద ఛాలెంజ్ ఉంది.
యశోద రిలీజ్ టైంలో సామ్ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉండటం సానుభూతి పరంగా ప్లస్ అవ్వడంతో పాటు కంటెంట్ యావరేజ్ గా ఉన్నా బోర్ కొట్టకుండా థ్రిల్లర్ టైపులో తీయడంతో ఈజీగానే గట్టెక్కింది. దానికైన బడ్జెట్, బిజినెస్ రెండూ పరిధి దాటనివి కావడంతో నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ సులభంగా సేఫ్ అయ్యారు. కానీ శాకుంతలం విషయం వేరు. ఖర్చు ఎప్పుడో చేయి దాటిపోయింది. మొదలుపెట్టినప్పుడు లేని దిల్ రాజు తర్వాత చేయందించారు. గుణశేఖర్ సర్వ శక్తులూ ఒడ్డారు. రుద్రమదేవి హిట్ అనిపించుకున్నా దానివల్ల ఆయనకు బాహుబలి రేంజ్ పేరూ డబ్బూ రాలేదు.
అయినా సరే మరో సాహసం చేసి శాకుంతలంకు ఒడి గట్టారు. ఇది మహాభారతం రామాయణంలా హీరోయిజం మలుపులున్న పాపులర్ ఇతిహాసం కాదు. పురాణాలు చదివిన వారికి మాత్రమే అవగాహన ఉన్న ప్రేమగాథ. ఇందులో విషాదం విరహం కోపం బాధ అన్నీ ఉంటాయి. యుద్దాలు గట్రా పెట్టారు కానీ శాకుంతల పడే ఆవేదనే ప్రధానాంశంగా సాగుతుంది. డ్రామా పాళ్ళు గుణశేఖర్ ఏ మేరకు పెట్టారనేది సినిమా చూశాకే తెలుస్తుంది కానీ నాటకీయత తక్కువగా ఉండే ఇలాంటి కథలతో ఇప్పటి జెనరేషన్ ని మెప్పించడం సులభం కాదు.
ప్యాన్ ఇండియా అంటున్నారు అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. నిర్మాణానికి అయిన ఖర్చు యాభై కోట్లు దాటేసిందని కొందరు ఎనభై దాకా వెళ్లిందరని ఇంకొందరు రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. ఇందులో నిజమెంతుందో పక్కన పెడితే తక్కువలో అయితే ముమ్మాటికీ కాలేదు. తమిళంలో లారెన్స్ రుద్రుడు, విజయ్ ఆంటోనీ బిచ్చగాడు 2 వస్తున్నాయి. వాటిని కాచుకోవడం అంత సులభం కాదు. పైగా రెండు వారాలు దాటితే అఖిల్ ఏజెంట్, మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ 2 దిగిపోతాయి. ఆలోగా శాకుంతలం అద్భుతాలు చేసేయాల్సిందే. ఆ భారం పూర్తిగా సమంతా మీదే ఉంది.



