sarath mandava ramarao on dutyదర్శకుడు శరత్ రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ తో పరిచయం అయ్యాడు. చాలా కాలంగా సినిమా తో సంబంధం ఉన్నప్పటికీ ఇదే తెలుగులో ఆయనకు మొదటి సినిమా. కొత్త దర్శకులకు భిన్నంగా ఆయన సినిమా ప్రమోషన్లను భుజాల మీద మోశాడు.

అయితే మాట్లాడిన ప్రతీ చోటా అడిగిన వారికీ అడగని వారికీ మీడియా గురించి తన అక్కసు వెళ్లగక్కాడు. సహజంగా మీడియా అనేది అందరికీ నచ్చాలని లేదు. అలా నచ్చేలా అయితే మీడియా తన పని సరిగ్గా చేస్తున్నట్టు కాదు.

అయితే శరత్ మాత్రం గిల్లుతూ పోయారు. సినిమా ఈవెంట్ లో స్టేజ్ ఎక్కి ట్విట్టర్ లో సినిమా మీద మక్కువ తో మాట్లాడే వారిని పిట్టలు, రెట్టలు అంటూ వికటంగా మాట్లాడారు. సహజంగా హీరోలకు ఉండే అభిమానులు తమ లాగే మీడియా కూడా తమ హీరోలకు, వారి సినిమాలకు భజన చెయ్యాలని ఆశిస్తారు.

తమ సినిమాలన్నిటీకీ 3 రేటింగులు ఇవ్వాలనుకుంటారు. ఇవ్వకపోతే కొందరైతే బూతులు తిట్టడమూ మాములే. సరే శరత్ వారి తరపున మీడియా మీద అక్కసు వెళ్లగక్కుతున్నాడు కదా, ఇంత మాట్లాడిన వాడు సినిమా కూడా అదే రేంజ్ లో తీసి ఉంటాడు కదా అనే అంచనాతో ఫుల్ గా సపోర్ట్ చేశారు.

ఎంతగా సపోర్ట్ అంటే అసలైన మాస్ మహారాజా ఆయనే అన్నట్టు. అయితే శరత్ చూపెట్టిన హీరోయిజం కేవలం ఇంటర్వ్యూల వరకే పరిమితం అయిపోయింది. సినిమా చూస్తే ఒక్కటంటే ఒక్క సీన్ కూడా పండటం సరికదా, కనీసం ఏదో రాసుకున్నాడులే అని కూడా అనిపించుకోలేకపోయాడు.

ఉదాహరణకు ఒక ఫ్లాష్ బ్యాక్ లో హీరోయిన్ హీరోని కాదని వేరే ఒకడిని పెళ్లి చేసుకుంటుంది. హీరో ఎందుకు అని అడిగితే… నీ పేరు చెప్పి నీకు మచ్చ తేలేక అన్నట్టు చెబుతుంది. వినడానికే రోతగా అనిపించే ఆ లాజిక్ కు హీరో ముసిముసి నవ్వులు నవ్వుకుంటాడు. మనం బుర్ర గోక్కుంటాం. ఇటువంటి బేసిక్ సీన్లు కూడా రాసుకోలేకపోయాడు దర్శకుడు.

ఎంత దారుణమంటే… ఎనర్జీకి మారుపేరైన రవితేజ చాలా సీన్లలో కనిపిస్తేనే నీరసం… థియేటర్ల నుండి బయటకు వచ్చేటప్పుడు ఫ్యాన్స్ భుజాల మీద ఏదో మోయలేని బరువు ఉన్నట్టు ఫీలింగ్ తెప్పించాడు.

కట్ చేస్తే పల్లకీ మోసిన ఫ్యాన్స్ దర్శకుడి పై బూతులు మొదలుపెట్టారు. ట్విట్టర్ పిట్టలు, రెట్టలు అంటూ మాట్లాడిన దర్శకుడు ట్విట్టర్ నుండి మాయం అయిపోయాడు. తన పాత ట్వీట్ల రిప్లైలకు తాళం వేశాడు.

చేసే పని మీద ఎంతో కొంత విషయ పరిజ్ఞానం పెంచుకుని పని తో మాట్లాడిస్తే మనం మాట్లాడే మాటకు విలువ పెరుగుతుంది… మన స్థాయి పెరుగుతుంది. శరత్ రిలీజ్ ముందు చెప్పిన మాటలు హిట్ కొట్టి చెబితే విలువ… ఇప్పుడు ఆయనను అభాసుపాలు చేశాయి.

ఇక్కడ నుండి ఆయన ప్రయాణం తేలిక ఏమీ కాదు… అయితే కృషి వుంటే.. మనుషులు… శరత్ కు ఆల్ ది బెస్ట్…