నాడు నేడు కేసులు, అరెస్టులు… కానీ చాలా తేడా ఉంది!

Seediri Appalaraju Arrest Sparks YSRCP Political Row

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపి అధినేత చంద్రబాబు నాయుడుతో సహా ఆ పార్టీ ముఖ్య నేతలపై కేసులు, అరెస్టులు ఏవిధంగా సాగాయో అందరూ చూశారు. నాడు పోలీసులు అర్దరాత్రి లేదా తెల్లవారుజామున నేతల ఇళ్ళను చుట్టుముట్టి గోడలు దూకి మరీ అరెస్ట్ చేసేవారు. వారిని వ్యానులో ఎక్కించి జిల్లాలు తిప్పుతూ ఏ అర్ధరాత్రో పోలీస్ స్టేషన్‌కు చేర్చేవారు. రాజకీయ వేధింపు అంటే ఇదీ!

వల్లభనేని వంశీ అనుచరులు గన్నవరంలో టీడీపి కార్యాలయంలో విధ్వంసం సృష్టిస్తున్నప్పుడు అడ్డుపడినందుకు టీడీపి సీనియర్ నేత పట్టాభిపైనే ఎదురుకేసు పెట్టి జైల్లో వేశారు. రాజకీయ వేధింపు అంటే ఇదీ!

ADVERTISEMENT

మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన కుప్పం ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు నాయుడుని హటాత్తుగా అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో పెట్టి నరకం చూపారు. రాజకీయ వేధింపు అంటే ఇదీ!

కానీ టీడీపిని నామరూపాలు లేకుండా తుడిచిపెట్టేయాలనే దురాలోచనతో చేసిన ఈ దుశ్చర్యలకు వైసీపీ చాలా భారీ మూల్యమే చెల్లించింది.

ఇప్పుడు కూటమి ప్రభుత్వ హయంలో కూడా వైసీపీ నేతలపై కేసులు నమోదవుతున్నాయి. అరెస్టులు చేస్తున్నారు కదా?అని సందేహం కలుగవచ్చు.

ఇవన్నీ రాజకీయ వేధింపులు… అక్రమ కేసులే అని వైసీపీ వాదిస్తున్నప్పటికీ, కొన్ని కేసులను తీసుకొని చూస్తే, టీడీపి కార్యాలయంపై దాడి కేసు నుంచి బయటపడేందుకు వంశీ, అనుచరులు ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి హైదరాబాద్‌ ఎత్తుకుపోయారు.

అటు చిత్తూరు, నెల్లూరు నుంచి ఇటు శ్రీకాకుళం వరకు భూకబ్జాలకు పాల్పడినందుకు వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. అనేక వందల ఎకరాలు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది కూడా.

మీడియా ఎదుట బహిరంగంగానే ముఖ్యమంత్రిని, పోలీస్ అధికారులను ఉద్దేశ్యించి చాలా అసభ్యంగా మాట్లాడినందుకు అంబటి రాంబాబుపై కేసులు నమోదవుతున్నాయి. ఈ విషయం ఆయనే స్వయంగా చెప్పుకుంటున్నారు కూడా!

రోడ్డు ప్రమాదంలో ఒకరి మరణానికి కారకుడైన కొడుకుని కాపాడేందుకు, సాక్ష్యం తారుమారు చేసినందుకు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈవిధంగా ప్రతీ కేసులో వైసీపీ నేతలు చేసిన తప్పులు చాలా స్పష్టంగానే కనిపిస్తున్నాయి. కానీ వారు చేయకూడని తప్పులు చేస్తూ పోలీసులు అరెస్ట్ చేస్తే, వారి అధినేత జగన్మోహన్ రెడ్డి వాటిని రాజకీయ వేధింపులుగా వర్ణిస్తూ, చిన్న పిల్లాడు, పొరపాటున యాక్సిడెంట్ అంటూ సమర్ధిస్తూ సోషల్ మీడియాలో పెద్ద పోస్ట్ కూడా పెట్టారు.

అదే.. టీడీపి నేతలు ఎవరైనా ఇలాంటి తప్పులు చేస్తే తక్షణం వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి కేసులు కూడా నమోదు చేయిస్తున్నారు.

కానీ దళిత యువకుడు సుబ్రహ్మణ్యంని హత్య చేసి శవాన్ని డోర్‌ డెలివరీ చేసినందుకు జైలుకి వెళ్ళివచ్చిన ఎమ్మెల్సీ అనంత బాబు నేటికీ వైసీపీలోనే ఉన్నారు. రెండు పార్టీలకు గల తేడా ఇదే.

చేయకూడని తప్పులన్నీ చేసి అరెస్ట్ అయితే అది రాజకీయ వేధింపే అని వైసీపీ నేతలు సమర్ధించుకోవడం చూస్తే వారికి ప్రజల విజ్ఞతపై కూడా చులకన భావం ఉందనిపిస్తుంది.

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో పోరాడి మంచి పేరు తెచ్చుకోవాల్సిన రాజకీయ నాయకులు, ఇలాంటి కేసులలో చిక్కుకొని ప్రజల సానుభూతి పొందాలనుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది.

ADVERTISEMENT
Latest Stories