చెల్లి దేవకి కడుపున జన్మించిన శ్రీకృష్ణుడుని చంపడం కోసం మేనమామ కంసుడు వెనకాడలేదు. కానీ చివరికి ఆ మేనల్లుడి చేతిలోనే కంసుడు చనిపోయాడు. మళ్లీ ఆ పురాణగాధ ఏపీ రాజకీయాలలో పునరావృతం కాబోతోందా? సింగిల్ సింహం జగన్ కూడా మేనల్లుడిని చూసి భయపడుతున్నారా? అంటే అవుననే అంటున్నారు చెల్లి షర్మిల.
ఆమె మీడియాతో మాట్లాడుతూ, “నా కొడుకు వైఎస్ రాజారెడ్డి ఇంకా రాజకీయాలలోకి రానేలేదు. కానీ అతనిని చూసి జగన్ అప్పుడే భయపడుతున్నారు. చంద్రబాబు నాయుడు చెపితే నేను నా కొడుకు రాజారెడ్డిని రాజకీయాలలోకి తీసుకురావాలనుకుంటున్నానని నేను చెప్పినట్లుగా ఓ ఫేక్ వీడియో సృష్టించి సోషల్ మీడియాలో పెట్టించారు.
అది చూసి నేను చాలా నవ్వుకున్నాను. నా కొడుకుకి ఆ పేరు పెట్టింది మా తండ్రిగారు వైఎస్ రాజశేఖర్ రెడ్డే. కానీ జగన్ తాను అయన వారసుడినని చెప్పుకుంటారు. కానీ ఆయన అసలు వారసుడు నా కొడుకు రాజారెడ్డే. అందుకే జగన్ నా కొడుకుని చూసి భయపడుతున్నట్లున్నారు. లేకుంటే ఈ ఫేక్ వీడియో ఎందుకు సృష్టించినట్లు? అని షర్మిల ప్రశ్నించారు.
ఉప రాష్ట్రపతి ఎన్నికలలో ఆర్ఎస్ఎస్, బీజేపిలకు జగన్ మద్దతు ఇవ్వడాన్ని ఆమె తప్పు పట్టారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడినని చెప్పుకుంటూ ఇలా చేయడానికి సిగ్గులేదా? ఒకవేళ మా తండ్రి బ్రతికి ఉండి ఉంటే జగన్‌ని చూసి సిగ్గుతో తలదించుకొని ఉండేవారు.
ఆర్ఎస్ఎస్, బీజేపిలకు మద్దతు ఇవ్వకూడదని తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికకు దూరంగా ఉండిపోయింది. కనీసం ఈ మాత్రం ఇంగింతం కూడా మీకు లేదా జగన్మోహన్ రెడ్డి? అని షర్మిల ప్రశ్నించారు.
సింగిల్ సింహానని గర్వంగా చెప్పుకునే జగన్ ‘ఎన్డీయేకి తోక’ అని షర్మిల ఎద్దేవా చేయడం చాలా అవమానకరమే కదా? ఆస్తుల విషయంలో తల్లిని, చెల్లిని కోర్టుకీడ్చి వారిపై బురద జల్లించిన జగన్ మామ, ఇప్పుడు మేనల్లుడు రాజారెడ్డిని చూసి భయపడుతున్నారంటే ఆశ్చర్యంగానే ఉంది.
ఇంతకాలం జగన్‌కి ఏకైక శత్రువు సిఎం చంద్రబాబు నాయుడు మాత్రమే అనుకుంటే, ఇప్పుడు ఆ శత్రువుల జాబితాలో మేనల్లుడు రాజారెడ్డి పేరుని కూడా చేర్చినట్లే ఉన్నారు. ఈ మాట చెల్లి షర్మిల స్వయంగా చెపుతుంటే కాదనుకోగలమా? కనుక ఏపీ రాజకీయాలలో మరోసారి కంస వధ తప్పదా?




