సినీ దర్శకుడు యోగి తన పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడంటూ షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ హారిక హైదరాబాద్, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తనను శారీరకంగా లొంగదీసుకునేందుకు యోగి యత్నించాడని సదరు ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసిన పోలీసులు, యోగిని పిలిపించి గంటన్నర సేపు విచారించారు.
ఈ నేపథ్యంలో మాదాపూర్ అడిషనల్ డీసీపీ గంగిరెడ్డి యోగిని తన కార్యాలయానికి పిలిపించుకుని… అతనిపై దారుణంగా ప్రవర్తించారు. విచారణ పేరిట పోలీసులు నిందితులను శారీరక హింసకు గురిచేసే సంఘటనలను అప్పుడప్పుడు మనం చూస్తూనే వున్నాం. తాజాగా అడిషనల్ డీసీపీ స్థాయి అధికారి అలాంటి పనికి ఒడిగట్టడం ఇప్పుడు సంచలనమైంది.
సదరు డైరెక్టర్ యోగిని బూటు కాలితో నిర్దాక్షిణ్యంగా తన్ని, చెంపలు పగలగొట్టారు. దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసిన వారు ఆశ్చర్యానికి గురవుతున్నారు. విచారించడానికి ఓ పద్ధతి ఉంటుందని, అడిషనల్ డీసీపీ స్థాయి అధికారి ఇంత హేయంగా ప్రవర్తించడం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే తమ ఎదుటే హారిక పట్ల యోగి దురుసుగా ప్రవర్తించాడని పోలీసులు చెప్తుండగా, వాటిని యోగి ఖండించారు.



