కేసీఆర్ తెలంగాణ సిఎంగా ఉన్నప్పుడు ఆయన మీడియా సమావేశానికి పిలిస్తేనే మీడియా ప్రతినిధులకు ప్రగతి భవన్‌లోకి ప్రవేశానికి అనుమతి లభించేది. అటువంటి కేసీఆర్ మొన్న తొలిసారిగా ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ టీవీ9 స్టూడియోకి వెళ్ళి రజనీకాంత్ అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన సిఎం రేవంత్ రెడ్డి, ప్రధాని నరేంద్రమోడీల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “తెలంగాణలో నా ఆనవాళ్ళు లేకుండా చెరిపేస్తామని, బిఆర్ఎస్ పార్టీని తుడిచిపెట్టేస్తామని కొందరు (రేవంత్ రెడ్డి) ప్రగల్భాలు పలుకుతున్నారు. అందుకోసం తెలంగాణలో నేను కట్టించిన సచివాలయంతో సహా అన్నిటినీ కూల్చేస్తారా? కేసీఆర్ అంటే హిస్టరీ ఆఫ్ తెలంగాణ. దీనిని ఎవరూ చెరిపేయలేరు.
నేను ఓ స్థాయికి ఎదిగాను. నా స్థాయిని ఎవరూ తగ్గించలేరు. అది ఎవరి వల్లా సాధ్యం కాదు. ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ పార్టీలు తుడిచిపెట్టుకు పోతాయనుకోవడం అవివేకం. తెలంగాణ కాంగ్రెస్ పదేళ్ళు ప్రతిపక్షంలో ఉంది. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. బిఆర్ఎస్ పార్టీ కూడా ఇదేవిదంగా ఒడిదుడుకులు ఎదుర్కొని మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయం,” అని అన్నారు.
లిక్కర్ స్కామ్ అనేది ప్రధాని నరేంద్రమోడీ సృష్టించిన ఓ స్కీమ్ తప్ప నిజంగా దానిలో ఏమీ లేదన్నారు. బీజేపీ అగ్రనేత బిఎల్ సంతోష్‌కు నోటీసులు ఇచ్చేందుకు ఆనాడు తెలంగాణ పోలీసులను ఢిల్లీలో బీజేపీ కార్యాలయానికి పంపినందుకే మోడీ కక్ష కట్టి ఈ లేని కేసును సృష్టించి తన కూతురు కవితని అరెస్ట్ చేయించి జైల్లో నిర్బందించారని, బెయిల్ కూడా రాకుండా చేస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు.
హిస్టరీ ఆఫ్ తెలంగాణలో కేసీఆర్ పేరుని ఎవరూ ఎన్నటికీ చెరిపివేయలేరనేది నూటికి నూరు శాతం నిజం. అలాగే కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేయాలంటే తెలంగాణ లేకుండా పోవాలనే మాట కూడా నిజం. అయితే తాన స్థాయిని ఎవరూ తగ్గించలేరనే కేసీఆర్ మాటలతో ఏకీభవించలేము. ఎందుకంటే ఒకప్పుడు మీడియాని తన వద్దకు రప్పించుకునే కేసీఆర్, ఇప్పుడు టీవీ9 స్టూడియోకి రావడంతోనే తన స్థాయి స్వయంగా తగ్గించుకున్నారు కదా?
అలాగే మోడీ తన కూతురు ఆణిముత్యమని ఆమెని మోడీ అన్యాయంగా లేని కేసులో ఇరికించి జైల్లో పెట్టారనే కేసీఆర్ వాదనలతో కూడా ఏకీభవించలేము. అలాగని కేవలం కేసు కారణంగానే ఆమెను అరెస్ట్ చేశారని కూడా అనుకోలేము.
ఎవరైనా తనను ఎదిరిస్తే కేసీఆర్ ఏవిదంగా సహించలేరో, అలాగే ప్రధాని మోడీ కూడా సహించలేరనుకోవచ్చు కదా? ప్రధాని మోడీని కేసీఆర్ ఎంతగా అవమానించారో, అవహేళన చేశారో అందరికీ తెలుసు.
కనుక కేసీఆర్ ఏవిదంగా తన రాజకీయ ప్రత్యర్ధులను అదును చూసి దెబ్బ తీశారో మోడీ కూడా అదేవిదంగా కేసీఆర్‌ని దెబ్బ తీస్తున్నారనుకోవచ్చు కదా? కనుక కేసులను, రాజకీయాలను పూర్తిగా వేరు చూసి చూడలేము.
అయినా ఇంతకాలం ప్రధాని నరేంద్రమోడీని విమర్శించని కేసీఆర్, కేటీఆర్ ఇప్పుడే ఎందుకు విమర్శిస్తున్నారంటే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే అనుకోవలసి ఉంటుంది. బీజేపీతో బిఆర్ఎస్ పార్టీకి ఎటువంటి రహస్య అవగాహన లేదని, మోడీని ఎదిరించగల ఏకైక ధీరుడిని నేనే అని చెప్పుకొని మరో నాలుగైదు ఎంపీ సీట్లు గెలుచుకునేందుకే మళ్ళీ మోడీ గురించి కాస్త గట్టిగా మాట్లాడుతున్నారని భావించవచ్చు.




