అప్పులకు సిద్ధమా..? తాకట్లు భద్రమా..?

Siddham-Meeting-600-Crores

సిద్ధం సిద్ధం…అంటూ వైసీపీ ఏర్పాటు చేసిన 4 బహిరంగ సభలకు దాదాపు 600 వందల కోట్లు ఖర్చు చేసింది జగన్ సర్కార్ అంటూ మండిపడ్డారు ఆయన సోదరి వైస్ షర్మిల. మీ బిడ్డ ఈ ఐదేళ్లలో మీ కోసం నొక్కిన బటన్లను గుర్తుపెట్టుకుని నా కోసం పోలింగ్ బూత్ లో ఫ్యాన్ గుర్తు బటన్ నొక్కండి అంటూ ప్రజలను మరో ఛాన్స్ కోసం వేడుకుంటున్నారు వైస్ జగన్.

ADVERTISEMENT

2019 లో జగన్ కు వచ్చిన ఒక్క ఛాన్స్ తో రాష్ట్రానికి మూడు రాజధానులు అంటూ ప్రకటించి ఐదేళ్లు గడిచేలోపు ఒక రాజధాని అమరావతిని తాకట్టు పెట్టారు….మరో రాజధాని విశాఖలోని ఋషి కొండకు గుండు కొట్టారు….మూడో రాజధాని కర్నూల్ ను ఏం చేయదలచుకున్నారో ఇంకా బయటకు రాలేదు. ఇలా అప్పులు చేస్తే తాకట్లు పెడుతూ సిద్ధమా అంటే దేనికి సిద్ధం..? అప్పులకా..? తాకట్లకా..?

అలాగే జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాష్ట్రానికి వస్తున్న కొద్దో గొప్పో ఆదాయాన్ని సంక్షేమ కార్యక్రమాలకే మళ్లించి అసలు అభివృద్ధి అనే పదాన్ని వైసీపీ డిక్షనరీ నుంచి పూర్తిగా చెరిపేసారు. ప్రజల జీవనప్రమాణాలు పెంచలేని వైసీపీ వారి ఖర్చులను మాత్రం ఆమాంతం మూడింతలు, నాలుగింతలు చేయగలిగినది. ఒక వర్గం ప్రజల ఓట్ల కొనడానికి మరో వర్గం ప్రజల నడ్డి విరిచి వాటి ద్వారా వచ్చే ఆదాయంతో తమ పార్టీ ఓటు బ్యాంకును పెంచుకోవడంలో జగన్ పూర్తిగా విజయం సాధించారు.

అత్త సొమ్ము అల్లుడి దానం మాదిరి రాజధాని రైతుల భూములను పేదప్రజలకు పంచుతూ అదేదేమో తమ సొంత ఆస్తి పంచినంత ప్రచారం చేసుకుంటున్నారు వైకాపా నాయకులు. బటన్ మాత్రమే నొక్కుతాను మరేమి చేయను, చేయలేను అంటూ నిర్మొహమాటంగా బహిరంగ వేదికల మీద ప్రకటిస్తున్న జగన్ ఇప్పటిదాకా అప్పో సప్పో చేసి, ప్రభుత్వ భూములను, ప్రభుత్వ ఆస్తులను తాకట్లు పెట్టి ప్రభుత్వాన్ని నెట్టుకొచ్చారు. ఇక ప్రజలు ఆ అప్పులకు సిద్దమై తాకట్లను భద్రం చేసుకోవడమే తరువాయి.

కేవలం ఇలా తానూ అధికారంలో ఉండడం కోసం రాష్ట్రం ఎంత అప్పుల ఊబిలో చిక్కుకుపోయినా సంక్షేమ కార్యక్రమాలు మాత్రమే చేస్తాను అంటూ చెప్పుకుంటున్న జగన్ ఇక భవిష్యత్ తరానికి ఏం మిగులుస్తారు..? అప్పులా.? వాటి తాలూకా వడ్డీలా..? తాకట్టు పెట్టిన పత్రాలా..? చెప్పాడంటే చేస్తాడంతే…అంటూ జగన్ పై ఇచ్చిన స్లొగన్స్ కేవలం ప్రచారాలకే పరిమితం చేసి మెడలు వంచి తెస్తానన్న ప్రత్యేక హోదాను ఎక్కడ తాకట్టు పెట్టారో..? చెప్పాలి.

2020 డిసెంబర్ కల్లా పూర్తి చేస్తానన్న పోలవరం ఏమైపోయిందో..? రాజధాని గ్రాఫిక్స్ లో కాదు ప్రజల జీవితంలో అంటూ చెప్పిన కళ్ళబుల్లి కబుర్లు ఏ చెట్టెక్కాయో..? విశాఖే రాజధాని అంటూ చేసిన ప్రకటనలు ఏ బ్యాంకు తాకట్టులో ఉన్నాయో..? సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తరువాతనే ఓట్లడుగుతా అంటూ ఇచ్చిన హామీలు ఏ మద్యం దుకాణంలో స్టఫ్ గా మారిపోయిందో..?

జనవరి 1 న రావాల్సిన జాబ్ క్యాలెండరు ఎక్కడ తిరుగుతుందో..? ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన సిపిఎస్ రద్దు హామీ ఏ ఫైల్ లో భద్ర పరిచారో..? నారావారి రక్త చరిత్ర అంటూ చెప్పిన పిట్ట కథకు ముగింపు ఎక్కడా..? కోడి కత్తి కేసుకు రుజువేది..? పెరిగిన అప్పుకి లెక్కేది..? ఇలా ఎన్నో ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన ముఖ్యమంత్రి జగన్ ప్రజాధనంతో పార్టీ సభలు నిర్వహించుకుని ప్రతిపక్ష నాయకుల మీద హీనమైన విమర్శలు చేస్తూ మరో ఛాన్స్ కోసం తాపత్రయ పడడం జగన్ రాజకీయ అవసరాన్ని తెలియచేస్తుంది.

కేవలం బటన్లు నొక్కడానికి ముఖ్యమంత్రి పదవి కావాలా..? వందలాది మంది సలహాదారులను పెట్టుకుని, వేల మంది ప్రభుత్వ యంత్రాగాన్ని అడ్డుపెట్టుకుని, లక్షలాది వాలంటీర్లను నియమించుకుని, సొంత పత్రిక, సొంత మీడియా ఛానెల్ పెట్టుకుని, కొన్ని వందల సోషల్ మీడియా అకౌంట్లను ఏర్పాటు చేసి, ఐ పాక్ టీం లను, ఐ పాక్ సర్వేలను నియమిస్తూ, లక్షకోట్ల ఆరోపణలను వెనకేసుకొని ఒక్కడినే..ఒక్కడినే అంటూ చెప్పే సానుభూతి కబుర్లు నమ్మడానికి ప్రజలు సిద్దమయితే నమ్మించడానికి జగన్ కూడా ఎపుడు సిద్దమే.

ADVERTISEMENT
Latest Stories